ఆంధ్రప్రదేశ్

andhra pradesh

‘అమ్మఒడి’లో మరో మార్పు.. ల్యాప్‌టాప్‌లకు మంగళం..

By

Published : Jun 27, 2022, 10:48 PM IST

Updated : Jun 28, 2022, 4:08 AM IST

అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. బైజూస్‌తో ఒప్పందంలో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగాయని పంపిణీ నిలిపివేస్తున్నామని పేర్కొంది.

అమ్మఒడి
అమ్మఒడి

అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు అందిస్తామన్న ల్యాప్‌టాప్‌లకు ప్రభుత్వం మంగళం పాడింది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధర పెరగడంతో పంపిణీని నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9-12 తరగతులు చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని, కావాలనుకునే వారు ఐచ్ఛికాలు ఇవ్వాలని గతేడాది పాఠశాల విద్యాశాఖ కోరింది. దీంతో సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఒక్కో ల్యాప్‌టాప్‌ను రూ.18 వేలు కొనుగోలు చేయాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌కు ప్రభుత్వం సూచించింది.

ఏపీటీఎస్‌ టెండర్లు నిర్వహించగా.. గుత్తేదార్లు రూ.26 వేలకు కోట్‌ చేశారు. అమ్మఒడి పథకం కింద పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.2వేలు మినహాయించుకొని రూ.13 వేలు మాత్రమే ఇస్తున్న విషయం విదితమే. ల్యాప్‌టాప్‌ను రూ.26వేలకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం లేదా విద్యార్థులపై మరో రూ.13 వేల భారం పడుతుంది. దీంతో వీటి పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరూ విద్యార్థులకు అమ్మఒడి కింద నగదునే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

లక్షలాది మందికి నిరాశ..

ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇస్తుందని 9-12 తరగతులకు చెందిన 7లక్షల మంది విద్యార్థులు ఆశగా ఎదురుచూశారు. ప్రభుత్వ నిర్ణయంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. తల్లులు పిల్లల్ని బడికి పంపించేలా ప్రోత్సహించేందుకు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని గతేడాది సీఎం జగన్‌ ప్రకటించిన విషయం విదితమే. బైజూస్‌తో ఇటీవల జరిగిన ఒప్పందం నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏటా ఎనిమిదో తరగతిలో ఇస్తామని వెల్లడించింది. మరో పక్క ల్యాప్‌టాప్‌లు అందని ఇంటర్మీడియట్‌ పిల్లలను ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌లో ల్యాప్‌టాప్‌లు ఇస్తే ఇంజినీరింగ్‌లోనూ విద్యార్థులకు ఉపయోగపడతాయి.

ఎస్సీలకు కోత..

ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలను మినహాయించి మిగతా మొత్తాన్ని మాత్రమే అమ్మఒడి కింద ప్రభుత్వం జమ చేసింది. ఉపకారవేతనాలు రూ.1900-2000 వస్తే వాటిని మినహాయించుకుని మిగతావి మాత్రమే బ్యాంకు ఖాతాలో వేసింది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 4:08 AM IST

ABOUT THE AUTHOR

...view details