ఆంధ్రప్రదేశ్

andhra pradesh

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. సరుకు రవాణాలో 51శాతం వృద్ధి!

By

Published : Sep 5, 2021, 4:59 PM IST

సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే దూసుకెళ్తోంది. ప్రయాణికులను సురక్షితంగా తరలిస్తూనే.. మెరుగైన ఫలితాలను రాబడుతోంది. ప్రయాణికుల రవాణా వల్ల తగ్గిన ఆదాయాన్ని సరకు రవాణా రూపంలో చేకూర్చుకుంటోంది. తద్వారా దేశంలో అత్యధిక ఆదాయ అర్జన జోన్ గా ఉన్న పేరును నిలబెడుతోంది. కష్టకాలంలో సిబ్బంది చేస్తోన్న కృషి.. ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు అందుకుంటోంది.

South Central Railway
South Central Railway

గడిచిన రెండేళ్లుగా అన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోన్న కరోనా మహమ్మారి రైల్వేపై కూడా పెను ప్రభావం చూపింది. కరోనా వ్యాప్తితో గతేడాది, ఈ ఏడాది లాక్ డౌన్ కాలంలో ప్రయాణికుల రైళ్ల రాకపోకలు చాలా కాలం పాటు నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తితో సాధారణ రైళ్లన్నింటినీ నిలిపివేసిన రైల్వే శాఖ... కేవలం పండుగల కోసం ప్రత్యేక రైళ్లను మాత్రమే పట్టాలెక్కించింది. కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయంతో రైళ్లలో ప్రయాణాలకు ప్రయాణికులు వెనుకంజ వేశారు. ఫలితంగా ప్రయాణికుల రవాణా ద్వారా వచ్చే రాబడి గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి పెట్టిన రైల్వే శాఖ సరకు రవాణాను పెంచింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే.. రికార్డు ఫలితాలను నమోదు చేసింది.

తక్కువ ఖర్చు.. ఎక్కువ రవాణా

లాక్ డౌన్​తో చాలా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర సరుకుల రవాణా కోసం పలు ప్రాంతాల నుంచి అదనంగా గూడ్స్ రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల మధ్య సరకు రవాణా రైళ్లను నడిపింది. రైళ్లకు డబుల్ ఇంజిన్లను ఏర్పాటు చేసి బోగీలు పెంచి ...ఒకేసారి రెట్టింపు సరకును చేరవేసింది. తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువగా సరకు రవాణా చేసింది. బొగ్గు, సిమెంట్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు సహా పలు రకాల నిత్యావసరాలను సరఫరా చేసింది. ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ... దక్షిణ మధ్య రైల్వేకి సరకు రవాణాలో ఆదాయం పంట పండుతోంది. సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.

51 శాతం అధికం..!

గతేడాది ఆగస్టులో జరిగిన సరకు రవాణా లోడింగ్‌తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 51 శాతం అధికంగా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే నివేదించింది. సిమెంట్‌ లోడింగ్‌లో గత సంవత్సరాలోని ఏ ఆగస్టు నెలతో పోల్చినా 2021 ఆగస్టులో మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 2021 నెలలో జోన్‌లో మొత్తం మీద 9.5 మిలియన్‌ టన్నుల సరకు లోడింగ్‌ అయ్యింది. ఇదే 2020 ఆగస్టులో జరిగిన 6.3 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌తో పోలిస్తే 51% అధికం. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 2021 ఆగస్టు నెలలో అన్ని రకాల సరుకులు అధికంగా లోడిరగ్‌ కావడంతో ప్రస్తుత సరుకు రవాణా లోడింగ్‌ గణనీయంగా పుంజుకుంది. సిమెంట్‌ రంగానికి సంబంధించి రైల్వే వారిచే ఎప్పటికప్పుడు చేపట్టిన వివిధ వినూత్న విధానాలు, జోన్‌లోని బీడీయూ బృందాల కృషితో ఈ ఏడాది ఆగస్టులో సిమెంట్‌ 2.93 మిలియన్‌ టన్నుల లోడింగ్‌ జరిగినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇది 2020 ఆగస్టులో జరిగిన 1.59 మిలియన్‌ టన్నుల లోడిరగ్‌తో పోలిస్తే 84% అధికం. సిమెంట్‌ లోడింగ్‌లో ఇంతకుముందు సంవత్సరాలలోని ఏ ఆగస్టు నెలతో పోల్చినా, ప్రస్తుత 2021 ఆగస్టు నెలలో జరిగిన సిమెంట్‌ లోడింగ్‌లో మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.

సిమెంట్ లోడింగ్​నే కాదు.. ఇతర వాటిల్లోనూ..

ఇదే తరహా అభివృద్ధి ఇతర సరుకుల లోడింగ్‌లో కూడా కనిపించింది. బొగ్గు లోడింగ్లో 72% నమోదు చేసింది. 2021 ఆగస్టులో 4.23 మిలియన్‌ టన్నులు, 2020 ఆగస్టులో 2.46 మిలియన్‌ టన్నులు నమోదు చేసింది., కంటైనర్‌ లోడింగ్‌లో 96% అభివృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగంలో 2021 ఆగస్టులో 0.188 మిలియన్‌ టన్నులు చేయగా,.. 2020 ఆగస్టులో 0.096 మిలియన్‌ టన్నులు రవాణా చేసింది. అంతేకాక, సరుకు రవాణా లోడిరగ్‌ అభివృద్ధి కోసం సరుకు రవాణా రైళ్లు స్థిరంగా గంటకు 50 కిలో మీటర్ల సగటు వేగంతో నడిచాయి. వ్యాగన్ల వ్యవస్థను మెరుగుపరిచి రోజుకు 4700కు పైగా సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. సరుకు రవాణా లోడింగ్‌లో జోన్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో నిరంతరంగా నెలనెలా మెరుగైన ఫలితాలను నమోదు చేయడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సంతోషం వ్యక్తం చేశారు.

'లోడింగ్‌లో అభివృద్ధి సాధించడానికి ఆపరేటింగ్‌, సహా కమర్షియల్‌ విభాగాల జోనల్‌ , డివిజినల్‌ బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు, కృషిని ఇక మీదటా కొనసాగిస్తే రైల్వే ప్రయాణికులు , సహా సరుకు రవాణా వినియోగదారులుకు ప్రయోజనకరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని నమోదు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాం' - గజానన్‌ మాల్య, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌

ఇదీ చదవండి

Ind vs Eng: టీమ్​ఇండియాలో కరోనా కలవరం

ABOUT THE AUTHOR

...view details