ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముఖ్యమంత్రి జగన్​కు సోము వీర్రాజు బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?

By

Published : Mar 16, 2022, 1:50 PM IST

Somu Veerraju Letter To CM Jagan: జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానున్న హామీని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి, నిరుద్యోగులను తీవ్ర నిరాశపరిచిందంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తాన్న ప్రభుత్వం వారికి నిద్రలేని రాత్రులను మిగులుస్తోందని దుయ్యబట్టారు. ఈ మేరకు సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు.

somu veerraju open letter to cm jagan
ముఖ్యమంత్రికి సోము వీర్రాజు బహిరంగ లేఖ

Somu Veerraju Letter To CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానున్న హామీని గాలికి వదిలేసి నిరుద్యోగులను తీవ్ర నిరాశపరిచిందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో కేవలం సచివాలయ, వాలంటీర్ల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని లేఖలో ప్రస్తావించారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తాన్న ప్రభుత్వం వారికి నిద్రలేని రాత్రులను మిగులుస్తోందని దుయ్యబట్టారు. జాబ్ క్యాలండర్​ను ప్రతి సంవత్సరం జనవరిలో ప్రకటిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం హామీని నమ్మిన నిరుద్యోగ యువత కోచింగ్‌ సెంటర్లలో రాత్రింబవళ్లు శిక్షణ తీసుకుంటూ అప్పులు చేసి మరి ఫీజులు కడుతున్నారని అన్నారు. నోటిఫికేషన్‌ జాడ ఉంటుందో లేదో తెలియదుగానీ ఇచ్చిన హామీ ఒకరోజు కాకపోతే మరొక రోజయినా నేరవేరుతుందన్న ఆశతో డిగ్రీ పట్టాను చేతిలో పట్టుకొని కోచింగ్‌ సెంటర్‌లో కాలం వెళ్లదీస్తున్నారని వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ ప్రభుత్వశాఖల్లో సుమారుగా 3 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నియమకాలు జరపకుండా వైకాపా అధికారంలో వచ్చినప్పటి నుంచి కాలం వెళ్లదీస్తూనే ఉందన్నారు. నీటిపారుదలశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవటంవల్ల తాగునీటి ప్రాజెక్టులన్నీ నత్తనడకన జరుగుతున్నాయని విమర్శించారు. మరోవైపు 3 వేలకు పైగా లస్కర్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల రైతులకు సకాలంలో నీరు అందడం లేదని ఆరోపించారు. రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోటం వల్ల పౌరసంబంధ సేవలు ప్రజలకు అందటంలేదని.. సమాచార శాఖలో ఉద్యోగ నియమకాలు జరపకుండా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో ఆయా శాఖాలో పారదర్శకత లోపిస్తోందని ధ్వజమెత్తారు.

Somu Veerraju Letter To CM: వ్యవసాయశాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా ఎందుకు కాలయపన చేస్తున్నారని లేఖలో నిలదీశారు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి సంస్థల్లో డిగ్రీ పట్టా ఉన్న యువతకు అవకాశం కల్పించే విధంగా నిబంధనలను సరళీకృతం ఎందుకు చేయటం లేదని అన్నారు. ఇప్పటికే డిగ్రీ పట్టా సాధించినవారికి అర్హత వున్నప్పటికీ ప్రభుత్వం ఉపాధి కల్పించటంలో, ఉద్యోగ అవకాశాలు కల్పించటంలోను ఆలసత్వం వహించటం వలన యువత తీవ్ర నిరాశతో ఉన్నారని ధ్వజమెత్తారు. జాబ్​ క్యాలెండర్‌ క్రియాశీలకంగా అమలుపరిచి ఉంటే యువతకు సకాలంలో ఇప్పటికే ఉద్యోగాలు వచ్చేవని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవటం వల్ల కాలపరిమితి వల్ల యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెగా డీఎస్సీ తెస్తారని బీ.ఎడ్‌ చేసిన విద్యార్థులు నోటిఫికేషన్‌ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని అన్నారు. పోలీసుల నియామకం చేయని కారణంగా శాంతి-భద్రతలు కాపాడే ఆ శాఖ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని విమర్శించారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగ అవకాశాల కోసం ఇంజనీరింగ్‌ పట్టాలు పొందిన పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పదోన్నతులు ద్వారా కాకుండా నూతన రిక్రూట్​మెంట్​ ద్వారా విద్యుత్ శాఖలో నియామకాలు జరపాలని డిమాండ్‌ చేశారు.

సాంఘిక సంక్షేమశాఖలో చాలా ఖాళీలు ఏర్పడ్డాయని దాదాపుగా ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ వ్యవస్థపై ఆధారపడే పరిస్థితులను ప్రభుత్వం పరోక్షంగా కల్పిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్​లో విడుదల చేసిన ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్​లో గ్రూప్ 1,2 కలిపి కేవలం 36 పోస్టులు పేర్కొన్నారని... వేలల్లో ఖాళీగా ఉన్న వాటిని ప్రస్తావించలేదని... గ్రూప్ 3,4 పోస్టులు ప్రస్తావన అసలే లేదని ఆరోపించారు. పోలీస్ శాఖకు సంబంధించి 400 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని వివరించారు. గ్రూప్ -1 ఖాళీ పోస్టులు 93 ఉండగా క్యాలెండర్​లో కేవలం 16 పోస్టులే చూపించారన్నారు.

Somu Veerraju Letter To CM Jagan: రెవెన్యూ శాఖలో లో 1148 పోస్టులు ఖాళీ ఉన్నాయని వీటిని భర్తీ చేయాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఇందులో 17 డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-1), 67 డిప్యూటీ తహశీల్దార్ (గ్రూప్-2) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని అత్యంత ప్రాధాన్యతగా భావించాలని రెవెన్యూ శాఖ కోరింది.కానీ 84 పోస్టులలో ఏడు మాత్రమే జాబ్ క్యాలెండర్ లో చూపించారన్నారు. 339 గ్రూప్-3 పోస్టులు, గ్రూప్-4 లో 639 దాచేశారని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే 768 ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు ఖాళీగా ఉండగా ఒకటీ క్యాలెండర్లో చూపించలేదని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో మాత్రమే వైద్యరంగంలో తాత్కాలిక నియామకాలు జరిపారని, ఇతర నియామకాలు జరగలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్లో టీచర్ పోస్టులు 25వేలు, కానిస్టేబుల్ పోస్టులు 16వేలు, లైబ్రరీసైన్స్ 6 వేల పోస్టులు, సచివాలయంలో 8 వేల పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ ను, అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే లాగా జాబ్ క్యాలెండర్​ను విడుదల చేయాలని తన లేఖ ద్వారా వీర్రాజు కోరారు.

ఇదీ చదవండి: తాను పడుకునే మంచానికే నిప్పు పెట్టాడు.. ఆస్పత్రిలో వ్యక్తి బీభత్సం!

ABOUT THE AUTHOR

...view details