ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sankranthi Special: మకర సంక్రమణం.. ఈ కాలంలో దేవి శక్తులు కొలువై ఉంటాయి..!

By

Published : Jan 13, 2022, 9:53 AM IST

Updated : Jan 13, 2022, 10:09 AM IST

sankranthi celebrated with different names: ఇంటింటా రంగవల్లులు.. బంతిపూల గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల మేళాలుతో సంక్రాంతి కోలాహలం అంతాఇంతా ఉండదు. ఇదంతా ఓ ఎత్తైతే.. రైతుల కళ్లలో మెరుపులు.. కొత్త బియ్యపు అరిసెలు.. గాలిపటాల రెపరెపలు.. అంతటా అందాల విరిజల్లులు.. ఆనందాల సంక్రాంతి సంబరాలు మరో ఎత్తు.మన సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజు. అంటే ఆరుమాసాల ఉత్తరాయణ దేవతలకు పగలు. ఈ కాలంలో దైవీ శక్తులు మేల్కొని ఉంటాయని పురాణాల చెబుతున్నాయి.

sankranthi special story
ఆరోగ్య ఆనందాల సంక్రమణం

sankranthi celebrated with different names: సమ్యక్‌ అంటే మంచి, క్రాంతి అంటే మార్పు. వెరసి సంక్రాంతి అంటే ‘మంచి మార్పు’ అని అర్థం. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని గమనాన్ని బట్టి ఏర్పడే తెలుగు పండుగలలో అతి ముఖ్యమైనది సంక్రాంతి. కాలగమనంలో వచ్చే మంచి మార్పుగా చెబుతారు. సంక్రాంతి లేదా సంక్రమణంగా పిలుచుకునే దీని అసలు పేరు మకర సంక్రమణం.

దేవతలకు ప్రీతికరమైన కాలం

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దీన్ని పుణ్యకాలమంటారు. మన సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజు. అంటే ఆరుమాసాల ఉత్తరాయణ దేవతలకు పగలు. ఈ కాలంలో దైవీ శక్తులు మేల్కొని ఉంటాయి. పొంగలి నివేదించి దేవతలను సంతుష్టులను చేస్తారు. పుణ్యకార్యాలు, దానధర్మాలకు అనువైన కాలమిది. గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, వివాహం, ఉపనయనం, లాంటి శుభకార్యాలకు శ్రేష్ఠమైనది. ధార్మిక చింతనకు కూడా ఉత్తరాయణం పుణ్యప్రదం. ఈ కాలంలో మరణించినవారికి పరమపదం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుకనే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వేచి ఉండి అప్పుడు ప్రాణాలు వదిలాడని పురాణ కథనం.

సూర్యుడు పితృదేవతా ప్రీతికరమైన దక్షిణాయనం నుంచి దేవతా ప్రీతికరమైన ఉత్తరాయణంలోకి మారే రోజు అయినందున పితృయజ్ఞం చేస్తారు. కుటుంబంలో చనిపోయినవారి పేరుతో దానధర్మాలు, భోజన దక్షిణాదులతో అతిథులను సంతృప్తిపరచి పంపుతారు. దీనివల్ల పితృదేవతలు దేవతానుగ్రహంతో భగవంతునిలో ఐక్యమౌతారని నమ్మకం. పెద్దలు పితృదేవతలకు మొక్కి ఆశీస్సులు పొందితే, పిల్లలు పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు, కానుకలు పొందుతారు. అందుకే దీనికి ‘దండాల పండుగ’, ‘మొక్కుల పండుగ’ అని కూడా పేరు. పండిన పంట ఇంటికి వచ్చే సందర్భం కనుక ఇది రైతులకు పెద్దపండుగ.

కోరికల సాఫల్యానికి ధనుర్మాస వ్రతం

ధనుర్మాసం నెల్లాళ్లు జరిగే విష్ణు ఆరాధనకు ముగింపు ఈరోజు. శ్రీ విల్లిపుత్తూరులో పరమ భాగవతోత్తముడైన విష్ణుచిత్తుడి గారాల బిడ్డ గోదాదేవి. ఆమె అతడికి దైవదత్త వరప్రసాది. దైవ కైంకర్యం కోసం తులసి దళాలను సేకరిస్తుంటే దొరికిందా చిన్నారి. ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడాయన. గోదా ఆడింది ఆట, పాడింది పాట. ఆ అతి చనువుతోనే పరమాత్ముని కోసం అల్లిన తులసి మాలలను మొదట తన మెడలో అలంకరించుకుని ఆ అందాన్ని నూతిలో చూసుకుని మురిసిపోయేది. ఆ తర్వాతే భగవంతునికిచ్చేది. ఆ తులసిమాలను ధరించిన శ్రీరంగనాథుని తప్ప ఇతరులను వివాహమాడనని నిశ్చయించుకుంది. తన కోరికను సాకారం చేసుకోవడానికి ధనుర్మాస వ్రతం ఆచరించింది. ఆ నెలరోజులు పొందిన అనుభూతుల్ని పాశురాలుగా రాసి సమర్పించింది.

భోగుడి బాధ తప్పింది

రాక్షసరాజైన బలి చక్రవర్తికి భోగుడని ఇంకో పేరు. అతణ్ణి పాతాళానికి అణగదొక్కింది ఈ రోజునే. అతడి పీడ విరగడైనందున గుర్తుగా మంటలు వేసి పండుగ జరుపుకుంటారు. ఆ ఆనంద సూచనగా పిల్లలకు దిష్టి తీయడమే భోగిపళ్లు. రేగిపళ్లు, చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు, నానబెట్టిన కొమ్ము శనగలు వగైరాలను చంటిపిల్లల తలమీంచి మూడుసార్లు తిప్పి నెత్తిమీద నుంచి కిందకు పోస్తారు. దీనివల్ల చీడపీడలు, రాక్షస భయాలు లేక చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు.

కృతజ్ఞతాపూజ

మన సంప్రదాయంలో ప్రతిఫలం ఇచ్చేవారికి ఫలితం పొందినవారు కృతజ్ఞత తెలపడం, గౌరవించడం ఆనవాయితీ. ఆ నేపథ్యంలో తమకు పాడిపంటలు అందించిన పశువులను పూజించడం ఈరోజు ప్రత్యేకత. కనుమనాడు పశువులను పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి చేసి పశువులకు పెట్టే సంప్రదాయం కొన్నిచోట్ల ఉంది. ఈ రోజున పశుశాలలు శుభ్రపరచడం, అలంకరించడం, పశువులకు పందాలు, వాటిని వీధుల్లో తిప్పడం లాంటి ఆచారాలున్నాయి. కొత్త అల్లుళ్లు ప్రత్యేక గౌరవమర్యాదలు అందుకుంటారు. ఊరంతా సందడి నిండుతుంది.

దేశమంతా సంక్రాంతి...

  • సంక్రాంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం జరుగుతుంది. రాత్రిపూట ‘తుకల్‌’ అనే దీపాల పతంగులను ఎగరేస్తారు.
  • మహారాష్ట్ర వాసులు సంక్రాంతికి నువ్వులు, బెల్లం, చక్కెర కలిపి తిల్‌ లడ్డూలు చేసి తాము తినడమే గాక ఇతరులకు పంచుతారు. పెళ్లయిన ఆడపిల్లను పుట్టింటికి పిలిచి కొత్త పాత్రను బహుమతిగా ఇచ్చి ‘హల్దీ కుంకుమ్‌’ వేడుక జరుపుతారు.
  • ఒడిశాలో సంక్రాంతి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. పెద్ద మంటలు చేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. మాఘయాత్ర పేరుతో ఉత్సవం జరుపుతారు.
  • పంజాబీయులు సంక్రాంతిని ‘మాఘి’, భోగి పర్వదినాన్ని ‘లోహరి’ అంటారు. రాత్రిపూట మంట వేసి, అందులో మిఠాయిలు, చెరకుగడలు, బియ్యం వేస్తారు. భాంగ్రా నృత్యం అనంతరం విందు ఆరగిస్తారు.
  • తమిళనాట నాలుగురోజులపాటు పొంగల్‌ జరుపుకుంటారు ‘భోగి పొంగల్‌’ రోజున కొత్త బియ్యం, పాలతో పాయసం చేసి ఇంద్రుడికి నైవేద్యం పెడతారు. మరునాడు ‘సూర్య పొంగల్‌’ నాడు సూర్యుణ్ణి మూడోరోజు ‘మట్టు పొంగల్‌‘ నాడు పశువులను అలంకరిస్తారు. నాలుగోరోజు ‘కన్యా పొంగల్‌’ సందర్భంగా పొంగల్‌ నైవేద్యం ముద్దలను పక్షులకు ఆహారంగా వేస్తారు.
  • ఉత్తరప్రదేశ్‌లో సంక్రాంతిని ‘కిచెరి’ అంటారు. పండుగనాడు గంగ, యమున, సరస్వతి నదులు కలిసే ప్రయాగలో స్నానం చేయడం ఆచారం.

చెరకు గరిటె!

మకరరాశికి అధిపతి అయిన శని వాతతత్వాన్ని కలిగించే గ్రహమని జ్యోతిష గ్రంథాలు తెలుపుతున్నాయి. నువ్వులు, బెల్లం, గుమ్మడి, చెరకుగడ వాతగుణాన్ని తగ్గిస్తాయి. అందువల్ల సంక్రాంతి నాడు ఆరోగ్యదాయకమైన ఈ పదార్థాలు తింటారు, దానం చేస్తారు. పొంగలి వండేటప్పుడు చెరకుగడ ముక్కలే గరిటెలుగా కలియ తిప్పడంలోనూ ఆంతర్యం ఇదే.

ఇదీ చదవండి:

SANKRANTHI: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు

Last Updated : Jan 13, 2022, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details