ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇకపై ఫిర్యాదు చేయాలంటే..పీఎస్​కు వెళ్లాల్సిన పనిలేదు.. అలా చేయొచ్చు

By

Published : Mar 7, 2022, 1:03 PM IST

పౌరులకు మెరుగైన సేవలందించేందుకు, సమాజంలో శాంతి భద్రతల్ని రక్షించేందుకు ఆధునిక తరానికి బాగా చేరువైన సామాజిక మాధ్యమాల్ని విజయవాడ పోలీసులు వారధిగా మలుచుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ద్వారా ఫిర్యాదుల్ని స్వీకరించి.. బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

Police
Police

ఇకపై ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్​కు వెళ్లాల్సిన పనిలేదు.. అక్కడ సైతం చేయోచ్చు..

నేరస్తులు, మోసగాళ్ల చేతుల్లో బాధితులుగా మారిన అమాయకపు ప్రజలకు న్యాయం చేసేందుకు.. అందరికీ అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు విజయవాడ పోలీసులు. నేరుగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందిపడే వారికి సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడూ వచ్చిన ఫిర్యాదుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఆ మేరకు ఫిర్యాదు చేసిన వారికి సమాచారం అందిస్తూ....కేసు తీవ్రతను బట్టి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

గతేడాది వచ్చిన ఫిర్యాదులు

గతేడాది జూన్ 17న ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా బాల్య వివాహం గురించి ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించిన పోలీసులు ఆ పెళ్లి జరగకుండా అడ్డుకున్నారు. 2021 సెప్టెంబరు 1న కేరళకు చెందిన ఓ వైద్యురాలు.. విజయవాడలో ఓ వ్యక్తి సెకెండ్‌ హ్యాండ్‌ కారు విక్రయిస్తానని రూ.11 లక్షలు తీసుకుని మోసం చేశాడని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. సంబంధిత వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు...ఆమెకు డబ్బు ఇప్పించారు. ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ యువకుడు...హాస్టల్‌కు వెళ్లే సమయంలో ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేయగా...నిఘా పెట్టిన పోలీసులు యువకుడిని పట్టుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

సామాజిక మాధ్యమాల ద్వారా కూడా..

ఫేస్‌బుక్‌ @vjacitypolice, ట్విట్టర్‌@vjacitypolice, ఇన్‌స్టాగ్రామ్‌ @vijayawadacitypolice లకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు . ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌ ద్వారా 19, ట్విట్టర్‌ ద్వారా 235, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 54 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘన, గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయం, రుణ యాప్‌ మోసాలు, అక్రమ మద్యం, సైబర్‌ నేరాలు ఇలా అన్ని రకాల నేరాలపై సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.


ఇదీ చదవండి:

Strange in Dundipalem: దుండిపాలెంలో వింత... పాలు తాగుతున్న నంది విగ్రహం

ABOUT THE AUTHOR

...view details