NTR TRUST MEDICAL AIDE: కరోనా మూడో దశతో మళ్లీ పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నందున.. వారిని ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం చేసింది. జూమ్ యాప్ ద్వారా వీడియో లింకులు షేర్ చేసి వేల మంది కొవిడ్ బాధితులకు టెలీమెడిసిన్ ద్వారా సాయం అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో ఈ టెలీ మెడిసిన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాయి. నలుగురు అమెరికన్లు సహా 12 మంది వైద్యులు.. వైద్య సాయం అందివ్వడంతో.. మందులు కూడా ఇంటికి పంపుతున్నారు. జూమ్ లింకులతో బాధితులు వీడియో కాల్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా వైద్య సాయం పొందుతున్నారు. ఒక యాప్ ద్వారా.. ఇన్ని వేల మందికి వైద్యసాయం అందించడం దేశంలోనే ప్రథమమని ఎన్టీఆర్ ట్రస్టు చెబుతోంది.
కరోనా రెండో దశలో ఆక్సిజన్ అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించిన ఎన్టీఆర్ ట్రస్ట్ యాజమాన్యం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వయంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవలే ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభిస్తారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోనూ ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధం చేస్తున్నారు. గతేడాది ఎన్టీఆర్ ట్రస్ట్ దాదాపు కోటి 75 లక్షల రూపాయల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలు అందించింది.