TDP LEADERS MEET GOVERNOR: గుడివాడ క్యాసినో నిర్వహణపై అధినేత చంద్రబాబు రాసిన 5పేజీల లేఖతోపాటు నిజనిర్ధారణ కమిటీ రూపొందించిన నివేదిక, వీడియోలు, ఇతర సాక్ష్యాలతో తెలుగుదేశం నేతలు రాజ్ భవన్ తలుపు తట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంగా మారి దేశవ్యాప్త చర్చకు దారితీసిందని గుర్తు చేసిన చంద్రబాబు.. దానికి తోడు మహిళల వేధింపులు, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలపై మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో దాడులు జరిగాయని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి అదనంగా ఇటీవల సంక్రాంతి సంబరాల్లో ఏర్పాటు చేసిన క్యాసినోలో పాల్గొన్న 13 మంది యువతుల తాలుకూ వివరాలను ఫిర్యాదు లేఖకు జతచేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహణపై నిజనిర్ధారణ చేసేందుకు పర్యటించిన తెలుగుదేశం నేతలపై వైకాపా గుండాల దాడి, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు, గుడివాడ తెదేపా కార్యాలయం, కార్యకర్తలపైనా దాడి, నేతల వాహనాలు ధ్వంసం, బాధితులపైనే అక్రమ కేసులు నమోదు.. వంటి అంశాలను తన ఫిర్యాదు లేఖలో చంద్రబాబు సవివరంగా పేర్కొన్నారు.
రాజ్యాంగ పెద్దగా గవర్నర్ జోక్యం చేసుకోండి..
Chandrababu on casino at Gudivada: కృష్ణా జిల్లా ఎస్పీ నుంచి కలెక్టర్, ఏలూరు రేంజ్ డీఐజీ, రాష్ట్ర డీజీపీలకు ఇప్పటికే అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు లేనందున.. రాజ్యాంగ పెద్దగా గవర్నర్ జోక్యం అవసరమని పేర్కొన్నారు. ఫిర్యాదు లేఖతోపాటు నిజనిర్థారణ కమిటీ నివేదిక, 8 వీడియో క్లిప్పింగులు, క్యాసినో నిర్వహణపై మీడియాలో వచ్చిన వివరాలు, 13మంది యువతులు ఈనెల 17వ తేదీన గోవాకు తిరుగుప్రయాణమైన టిక్కెట్ వివరాలు జత చేశారు. దీనికి తోడు కె కన్వెన్షన్‌లో సంక్రాంతి సంబరాల నిర్వహణకు సంబంధించిన కరపత్రాన్ని ఫిర్యాదు లేఖతో కలిపి గవర్నర్ కార్యదర్శి సిసోడియాకు అందించినట్లు తెదేపా నేతలు తెలిపారు. క్యాసినో నిర్వహణలో అనుమతిలేని విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగం పెద్దఎత్తున జరిగిందన్న నేతలు మనీ ల్యాడరింగ్, విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగంతో పాటు దేశభద్రతకు విఘాతం కలిగించే పరికరాలు క్యాసినోలో వినియోగించారని..తక్షణమే వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా నేతలు, ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
దాడులు యాధృచ్ఛికం కాదు..
అక్రమంగా క్యాసినో నిర్వహణ ద్వారా రూ. 500 కోట్లు నల్లధనం చేతులు మారిందని ఫిర్యాదు లేఖలో చంద్రబాబు ఆరోపించారు. ఇంత పెద్దమొత్తంలో నగదు మార్పిడి జరగడం నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాట స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్న ఆయన.. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతోపాటు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందన్నారు. గతంలో డ్రగ్స్ పై ప్రశ్నించినప్పుడు తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌పై దాడి చేసిన నేతలు.. క్యాసినో వ్యవహారంపై ప్రశ్నిస్తే స్థానికి పార్టీ క్యార్యాలయంపై దాడి చేయడం యాధృచ్ఛికం కాదని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఇటువంటి హింసాత్మక దాడులకు పదేపదే పాల్పడుతూ.. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తోందని చంద్రబాబు విమర్శించారు.
కొడాలి నాని క్యాసినో నానిగా మారి..
ప్రభుత్వంపై అసమ్మతి తెలిపిన వారిపై హింసాత్మక దాడులకు పాల్పడుతూ.. తప్పుడు కేసులు బనాయిస్తూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వలస పాలన లాంటి బ్రిటీష్ రాజ్‌ను వైకాపా తలపిస్తోందని ఫిర్యాదు చేశారు. క్యాసినోపై విచారణకు హాస్యాస్పందంగా గుడివాడ డీఎస్పీ అధికారిపై అదే ర్యాంకు కలిగిన నూజివీడు డీఎస్పీని నియమించటంతోనే పోలీసుల కుమ్మక్కు బయటపడిందన్నారు. కొడాలి నాని క్యాసినో నానిగా మారి రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందే..
పోలీసుల అనుచిత నిర్లక్ష్యపు చర్యలను పరిశీలిస్తే.. అక్రమ క్యాసినో నిర్వహణ, తెదేపా కార్యాలయం, నేతలపై దాడిలో అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారన్నది స్పష్టమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. అక్రమ క్యాసినో నిర్వహణపై చర్యలు తీసుకోకుంటే సమాజం, రాజకీయాలపై చాలా దుష్ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. విచారణ సజావుగా జరగాలంటే సదరు మంత్రిని పదవి నుంచి తప్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. పోలీసుల ఏకపక్ష చర్యలు భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో విద్యార్దుల ఆందోళన
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!