ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏటీఎంలో కరెంటు తీస్తున్నారు... సొమ్ము కొట్టేస్తున్నారు!

By

Published : Aug 29, 2020, 5:58 PM IST

Updated : Aug 29, 2020, 6:31 PM IST

విజయవాడ నగరంలో వరుస ఏటీఎం చోరీలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సత్యనారాయణపురంలో ఓ ఏటీఎంలో నగదు చోరీకి గురైందన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు... ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. నగరంలోని 12 ఏటీఎంల్లో 41,50,500 రూపాయల మొత్తాన్ని కాజేశారని తెలిసి విస్తుపోయారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ATM thefts in Vijayawada
ATM thefts in Vijayawada

విజయవాడలో కొత్త తరహాలో ఏటీఎంలో నగదు చోరీ చేస్తున్నారు దుండగులు. తమ ఖాతాల్లోని నగదును ఏటీఎం నుంచి విత్ డ్రా చేసేందుకు కావాల్సిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసి... సరిగ్గా యంత్రం నుంచి నగదు బయటకు వచ్చే సమయంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. ఫలితంగా వారి ఖాతాల్లో డెబిట్ కాకుండానే నగదు వచ్చేస్తుంది. ఇలా జులై, ఆగస్టు నెలల్లో 12 ఏటీఎం కేంద్రాల నుంచి దాదాపు 41 లక్షల రూపాయలను కాజేశారు. వీటిని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణపురంలో ఓ ఏటీఎంలో నగదు చోరీకి గురైందన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు... దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి.

ఏటీఎం యంత్రాల నుంచి నగదు ఎలా మాయమవుతోందనే అంశంపై బ్యాంకు అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఏయే కేంద్రాల్లో, ఏయే సమయాల్లో అనుమాస్పద నగదు ఉపసంహరణలు జరిగాయో గుర్తించారు. అనంతరం ఆయా కేంద్రాల్లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను చూశారు. ఆయా సమయాల్లో ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్ డ్రా చేస్తున్న వారు.. నగదు బయటకు వచ్చే సమయంలో ఆ యంత్రానికి విద్యుత్తు సరఫరా చేసే కేబుల్ వైర్​ను కట్ చేయడం గానీ, విద్యుత్తు సరఫరా చేసే స్విచ్చ్​ను ఆపేస్తున్నారు. దీనివల్ల వారి ఖాతాల్లో నగదు డెబిట్ కాకుండానే ఏటీఎం ద్వారా నగదు బయటకు వస్తుంది. ఏటీఎం నిర్వహణ కేంద్రాల్లో ఆ ట్రాన్సాక్షన్ విఫలమైనట్లు నమోదు అవుతుంది. సంబంధిత ఖాతాకు ఆ మొత్తం తిరిగి జమవుతోంది. ఒకవేళ నగదు జమకాకపోతే సదరు వ్యక్తి ... ఆ బ్యాంకుకు ఫోన్ చేసి తమకు నగదు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా జులై 4 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు మొత్తం 41,50,500 దుండగులు కాజేసినట్లు గుర్తించారు.

Last Updated : Aug 29, 2020, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details