Cinema Tickets: సినిమా థియేటర్లలో మూడు శ్లాబుల్లో టికెట్ల ధరలు ఉంటాయని ఫిలిం ఛాంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముత్యాల రాందాస్ తెలిపారు. సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటైన కమిటీ సచివాలయంలో గురువారం సమావేశమైంది. టికెట్ల ధరలు ఎంత మేరకు పెంచాలనే అంశంపై కమిటీ చర్చించింది. సమావేశం అనంతరం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ..‘సినిమా టికెట్ ధర కనీసం రూ.40 ఉండాలని సూచించాం. దీనికి దగ్గరగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. త్వరలో టికెట్ల ధరల పెంపు ఉంటుంది. కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం. వారం, పది రోజుల్లో ఉత్తర్వులు వస్తాయి. టికెట్ల ధరలపై తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజలను, సినిమా పరిశ్రమను సంతృప్తి పరిచేలా నిర్ణయం ఉంటుంది. సినిమా వ్యయం రూ.100కోట్లు దాటితే టికెట్ ధరలు ఎలా ఉండాలనే దానిపైనా చర్చించాం. థియేటర్లలో ఐదో షో పైనా సమావేశంలో చర్చ జరిగింది. చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు. అనంతరం తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ ఛైర్మన్ తుమ్మల సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘థియేటర్లను ఏసీ, నాన్ ఏసీ, ఎయిర్ కూల్ వారీగా విభజిస్తారు. పంచాయతీలు, నగరాల్లోనూ జీఎస్టీ, విద్యుత్తు బిల్లుల ఖర్చులు ఒకేలా ఉన్నందున టికెట్ల ధరల్లో వీటిని పరిగణనలోకి తీసుకుంటారు’ అని వెల్లడించారు.
Cinema Tickets: 'సినిమా టికెట్ల ధరలపై.. త్వరలోనే నిర్ణయం'
Cinema Tickets: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే నిర్ణయం వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రేక్షకులు ఇబ్బందిపడే సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు.
Cinema Tickets