ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్​లో భాజపా విజయ సంకల్ప సభ.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

By

Published : Jul 3, 2022, 10:22 AM IST

Heavy security in Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ భాజపా నిర్వహించనున్న విజయసంకల్పసభకు... పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సహా కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రముఖ నేతలు హాజరవుతుండడంతో... పకడ్బందీగా భద్రత కల్పించారు. అడుగడుగునా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు అమర్చారు. పరేడ్‌ మైదానం పరిసరాల్లో దాదాపు 3వేల మంది పోలీసులు.... సభ వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. మరోవైపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి

Heavy security in Hyderabad
భాజపా సభ.. నగరంలో భారీ బందోబస్తు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Heavy security in Hyderabad: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భారతీయ జనతా పార్టీ భారీగా నిర్వహించనున్న విజయసంకల్ప సభకు... పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతో పాటు మైదాన పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచనున్నారు. భాజపా జాతీయ నేతలంతా సభకు హాజరవుతుండడంతో.. పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ పరిసరాల్లో సుమారు 3 వేల మంది పోలీసులతో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌, తెలంగాణ పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు.

శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 10గంటల వరకూ మొత్తం 36గంటలు పోలీస్‌ ఉన్నతాధికారులు.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల భద్రతలపైనే దృష్టి సారించనున్నారు. ప్రధాని భద్రతను పర్యవేక్షిస్తున్న ఎస్పీజీ అధికారులతో.. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నోవాటెల్‌లో ప్రధాని బస, పరేడ్‌ మైదానంలో బహిరంగ సభ, రాజ్‌భవన్‌లో ప్రధాని బస అంశాలపై చర్చించినట్లు సమాచారం.

బహిరంగసభ వద్ద భద్రతను పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి బహిరంగ సభకు చేరుకునే మార్గంలో.. వెయ్యిమంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. రూఫ్‌టాప్‌ బందోబస్తు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీసీ కెమెరాలు.. ఇలా నాలుగంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 10గంటల నుంచే..ఎస్పీజీ బృందాలు బహిరంగ సభ ప్రాంగణం, సభావేదికను తమ ఆధీనంలోని తీసుకున్నాయి. జాతీయ నాయకులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు , కేంద్రమంత్రులకు ప్రత్యేకంగా కేటాయించిన గ్యాలరీల వద్ద.. భద్రత ఏర్పాట్లను పరిశీలించాయి.

విజయ సంకల్పసభలో ప్రసంగం అనంతరం ప్రధాని.. నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. మోదీ తొలిసారి రాజ్‌భవన్‌లో బస చేస్తున్నందున.. పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధాని 43గంటల పాటు హైదరాబాద్‌లో తొలిసారిగా ఉండనుండటంతో.. రాజ్‌భవన్, నోవాటెల్, పరేడ్‌ మైదానం పరిసర ప్రాంతాలను.. హైసెక్యూరిటీ జోన్లుగా పరిగణించి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రధాని రాక సందర్భంగా కాంగ్రెస్, తెరాసతోపాటు ఎమ్మార్పీఎస్​, ఇతర ప్రజాసంఘాలు.. నిరసనలు వ్యక్తం చేయనున్నారనే సమాచారంతో.. భద్రత కట్టుదిట్టం చేశామని అధికారులు చెబుతున్నారు.

బహిరంగ సభ దృష్ట్యా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హెచ్​ఐసీసీ, మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రాజభవన్‌, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్‌ మైదానం చుట్టుపక్కల రోడ్లపై.. నగరవాసులు ప్రయాణించడం మానుకోవాలని పోలీసులు సూచించారు. టివోలీ చౌరస్తా నుంచి ప్లాజా చౌరస్తా వరకు రహదారిని పూర్తిగా మూసివేయనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చేవారు.. నిర్దేశిత సమయం కంటే ముందుగానే చేరుకోవాలని సూచించారు. సభ కారణంగా పరేడ్‌ మైదానం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో అన్ని రహదారులు రద్దీగా ఉంటాయని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.

మరోవైపు ఇవాళ ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు.. 50 రకాల తెలంగాణ వంటకాలను ఆస్వాదించనున్నారు. మధ్యాహ్న భోజనంలో తెలంగాణ వంటలను వడ్డించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. భోజనంతో పాటు స్నాక్స్‌ కూడా తెలంగాణ రుచులే తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వంటలన్నీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన యాదమ్మ చేయనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details