ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోటీని ఎదుర్కొంటూ.. వీలైనంత తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: సీఎం జగన్

By

Published : Feb 24, 2022, 5:34 PM IST

సహకార బ్యాంకుల ద్వారా వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రైతుల ఆదరణ పొందడం ద్వారా డీసీసీబీలు లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ పడొద్దని.., రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలని సీఎం నిర్దేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగాలన్నారు.

వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి
వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలి

సహకార బ్యాంకులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. సహకార శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై ఆరా తీశారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. డీసీసీబీలు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై చర్చించి అధికారులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు.

సహకార బ్యాంకులను కాపాడుకోవాలని సీఎం అన్నారు. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తుండటం వల్ల, ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందన్నారు. వెసులుబాటు మేరకు వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. బ్యాకింగ్‌ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలన్నారు. ఈ పోటీని తట్టుకునేందుకు ఆర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వాలన్నారు. నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధిచెందుతాయని, మంచి ఎస్‌ఓపీలను పాటించేలా చూడాలని సీఎం నిర్దేశించారు. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలన్నారు. డీసీసీబీలు పటిష్టంగా ఉంటే.. రైతులకు మేలు జరుగుతుందన్నారు. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయని, రుణాలపై భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోందన్నారు. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమ వైపుకు తిప్పుకోవచ్చని, తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుందన్నారు.

రుణాల మంజూరులో రాజీ, రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలని నిర్దేశించారు. సహకార బ్యాంకుల్లో ఖాతాదారులకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బ్యాంకింగ్‌ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగాలన్నారు. ఆ మేరకు పీఏసీఎస్‌లను మ్యాపింగ్‌చేసి.. వాటి కింద వచ్చే ఆర్బీకేలను నిర్ణయించాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాలను పీఏసీఎస్‌లతో అనుసంధానం చేయాలన్నారు. ఆర్బీకేలు, ఆర్బీకేల్లోని బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధికారులు బ్యాంకింగ్‌ నిపుణులతో మాట్లాడి ఒక విధానాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు.

జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతిమంగా ప్రతి రైతుకూ మేలు జరగాలని, ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలన్నారు. ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారుచేసి తనకు నివేదించాలని సీఎం అధికారలను ఆదేశించారు. వ్యవసాయ సలహామండళ్ల సమావేశాల్లో బ్యాకింగ్‌ రంగంపై రైతులనుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి దానిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సమర్థవంతంగా వాడుకోవాలన్న సీఎం.. బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో కూడా కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: BJP Veerraju on TTD: హిందుత్వం అంటే వ్యాపారం కాదు: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details