ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CHANDRABABU ON SAKSHI MEDIA: ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.1,200 కోట్ల సమీకరణ అవినీతి కాదా..?

By

Published : Jan 12, 2022, 4:22 AM IST

Updated : Jan 12, 2022, 4:34 AM IST

CHANDRABABU ON SAKSHI MEDIA

CBN ON SAKSHI MEDIA: సాక్షి మీడియా ఏర్పాటులో వాటాల విక్రయం మాటున జరిగిన ప్రక్రియను తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇటువంటి చర్యలపై ఆదాయపన్ను శాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమార్జనపై పన్ను కడితే.. అది సక్రమమౌతుందా అని ప్రశ్నించారు. వీటిని అరికట్టేందుకు చట్టాల్లో తగిన మార్పులు తీసుకురావాలని కోరారు.

CHANDRABABU NAIDU ON SAKSHI MEDIA:‘‘సాక్షి మీడియా ఏర్పాటు కోసం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా రూ.1,200 కోట్లు సమీకరించారు. అది అవినీతి కాదని ఆదాయపన్నుశాఖకు అనిపిస్తే ఈ దేశంలో చేయగలిగింది ఏమీ లేదు. అవినీతికి పాల్పడే వారిని ఎవరూ పట్టుకోలేరు. కష్టపడకుండా అడ్డదారుల్లో సంపాదించడమనే ‘జగన్‌ మోడల్‌’ ప్రతి రాజకీయ నాయకుడికి న్యూ మోడల్‌గా మారిపోతుంది...’’ అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.1,200 కోట్ల సమీకరణ అవినీతి కాదా..?

అక్రమ సంపాదనతో ఎన్నికల్లో పోటీ..!

అవినీతి, దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుని ఆదాయపన్ను కట్టేస్తే చాలు అనంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ధ్వజమెత్తారు. ‘రూ.10 షేరును... రూ.2,000, రూ.3,000 విక్రయించి అడ్డదారుల్లో సంపద పెంచుకుని ఆ సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే రాజకీయ అవినీతి గురించి మాట్లాడే పరిస్థితే ఉండదు.. సీబీఐ, ఈడీలు విచారణ జరుపుతున్న కేసుల్లో ఆదాయపన్నుశాఖ వాటితో సమన్వయం చేసుకునేలా, డబ్బులు ఎలా వచ్చాయో వెల్లడయ్యేలా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేయాలి. లేకుంటే రాజకీయాలను వ్యాపారంగా తీసుకుని ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. ఎలా సంపాదించినా సరే మాకు పన్నులు కడితే చాలు రైట్‌రాయల్‌గా వ్యవహరించొచ్చు అనేలా ఆదాయపన్నుశాఖ వ్యవహరించడం సరికాదని చంద్రబాబు అన్నారు.

అప్పులు చేయడంలో జగన్ గత సీఎంలను మించిపోయారు..

అక్రమ మైనింగ్‌, అక్రమ మద్యం, గంజాయి, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతో పన్ను కట్టినా ఆ శాఖకు ఆనందమేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘చైతన్యరథం’’ పేరిట తెదేపా సామాజిక మాధ్యమ ఈ-పత్రికను మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇస్తుంటే.. దాన్ని తగ్గించి 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అందరూ 2019 వరకూ రూ.3.14 లక్షల కోట్లు అప్పు చేస్తే.. జగన్‌ ఒక్కరే ఈ రెండున్నరేళ్లలో అంత అప్పు చేశారని, రాష్ట్ర అప్పులు రూ.7 లక్షల కోట్లు దాటిపోయాయని చెప్పారు.

అక్రమ సొమ్ముతో రైట్‌ రాయల్‌గా రాజకీయ నేతల్లా చలామణీ

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఇసుక, బెరైటీస్‌, బాక్సైట్‌, గ్రానైట్‌, ముగ్గురాయి ఇలా ఏదో ఒక ఖనిజ దోపిడీ జరుగుతోంది. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొందరు రైట్‌రాయల్‌గా రాజకీయ నేతలుగా చలామణీ అవుతున్నారు. పాలకులే స్మగ్లర్లు అయ్యాక పోలీసుల అండతో వివిధ రకాల మాఫియాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. కుప్పంలో నిన్నమొన్నటి వరకూ సాదాసీదా రౌడీషీటర్లుగా ఉన్న వారు ఇప్పుడు స్మగ్లర్లుగా మారి నాపైనే బాంబులు వేస్తామంటున్నారు. స్మగ్లర్లకు ఈజీ మనీ వస్తే జరిగే అరాచకాలివే...’ అని పేర్కొన్నారు.

స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై వేటు దుర్మార్గం

స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై ప్రభుత్వం వేటు వేస్తుండటం దుర్మార్గమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మీడియా సంస్థలు, పత్రికలకు కుల ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎల్లో మీడియా అని, తెదేపా వాళ్లని అంటున్నారు. మీడియా ఎప్పుడూ ప్రజాహితంగా ఉంటుంది. మంచి పనులు చేస్తే అనుకూలంగా రాస్తారు. చెడ్డ పనులు చేస్తే ఎత్తి చూపుతారు. అలాంటి వారిని మానసికంగా వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. వారి ఆస్తులు లాక్కుంటున్నారు...’ అని పేర్కొన్నారు.

ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికే ఈ పత్రిక

తెదేపా సామాజిక మాధ్యమ ఈ-పేపర్‌కు ‘‘చైతన్య రథం’’ అని పేరు పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎన్టీఆర్‌ చైతన్య రథాన్ని అధిరోహించి 9 నెలల వ్యవధిలోనే 202 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు. ఈ పత్రికను నిత్యం 30 లక్షల మందికి చేరేలా చేస్తున్నాం. ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికి ఈ పత్రికను ఉపయోగిస్తాం. తెదేపా కార్యకర్తలు, నాయకులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, అదే సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వారిలో చైతన్యం తేవడం మా ఉద్దేశం.’ అని చెప్పారు.

చిరంజీవి పార్టీ పెట్టినా ఆయనతో ఎలాంటి విభేదాలు లేవు

2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోతే తాను అధికారంలోకి వచ్చే వాడినని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టినా తనకు ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని, అంతకు ముందు, ఇప్పుడు తాను ఆయనతో బాగానే ఉన్నానని చెప్పారు. ఆయనే కాదు అందరూ తనతో బాగానే ఉంటారన్నారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలోకి తెదేపాను లాగుతున్నారని.. కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా తనకు వ్యతిరేకంగా కొందరు సినిమాలు తీశారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:TDP Statewide Dharna on rates hike : పెరిగిన ధరలపై కదం తొక్కిన తెదేపా...రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Last Updated :Jan 12, 2022, 4:34 AM IST

ABOUT THE AUTHOR

...view details