ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN: ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీకి లేఖ

By

Published : Jan 3, 2022, 3:21 PM IST

CBN Letter To DGP: విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే.. వైకాపా జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరావు గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్​ విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. విగ్రహ ధ్వంసంపై డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాసిన ఆయన.. ప్రణాళికాబద్ధమైన దాడుల్లో పోలీసుల అలసత్వం తగదని హితవు పలికారు.

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై డీజీపీకి చంద్రబాబు లేఖ
ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై డీజీపీకి చంద్రబాబు లేఖ

CBN Letter To DGP: రాష్ట్రంలో మహనీయుల విగ్రహాల విధ్వంసం కొనసాగితే.. ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మహనీయుల విగ్రహాలపై జరుగుతున్న ప్రణాళికాబద్ధమైన దాడుల్లో పోలీసుల అలసత్వం తగదని హితవు పలికారు. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే.. వైకాపా జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరావు ఎన్టీఆర్​ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

అధికార వైకాపా నాయకుల అండదండలతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపితే అదుపులోకి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. విధ్వంసక చర్యలు మరింత విస్తరించకుండా నియంత్రించాలని లేఖలో డీజీపీని కోరారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని.. ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది..
ఆదివారం గుంటూరు జిల్లా దుర్గిలో.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహంపై దాడి జరిగింది. వైకాపా జడ్పీటీసీ యలమంద కుమారుడు కోటేశ్వరరావు.. గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్.. కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

తెదేపా ఆందోళనలు..
ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకు దిగిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు దుర్గికి పార్టీ నాయకులు రాకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు.

ఇదీ చదవండి :

NTR STATUE IN DURGI : అందరూ చూస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి!

ABOUT THE AUTHOR

...view details