ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cbi on lepakshi Case: 'కుట్రలో ఆయనా భాగస్వామే.. అందరూ కలిసి లేపాక్షికి లబ్ధి'

By

Published : Dec 23, 2021, 9:55 AM IST

CBI on Lepakshi Case: ప్రైవేటు కంపెనీ లేపాక్షికి అనంతపురం జిల్లాలో 10వేల ఎకరాలు కట్టబెట్టడంలో జరిగిన కుట్రలో మంత్రులు, కార్యదర్శులతో పాటు ఐఏఎస్‌ మురళీధర్‌రెడ్డి భాగస్వామేనని సీబీఐ పేర్కొంది. అందరూ కలిసి లేపాక్షికి లబ్ధి చేకూర్చారని.. అందులో భాగంగానే జగన్‌ కంపెనీల్లోకి రూ.50కోట్ల ముడుపులు వచ్చాయని పేర్కొంది.

లేపాక్షి కంపెనీ
cbi on leepakshi

CBI on Lepakshi Case: అనంతపురం జిల్లాలో ప్రైవేటు కంపెనీ లేపాక్షికి 10వేల ఎకరాలను కట్టబెట్టడంలో జరిగిన కుట్రలో మంత్రులు, కార్యదర్శులతో పాటు అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు, ఏపీ ఐఏఎస్‌ డి.మురళీధర్‌రెడ్డి భాగస్వామేనని సీబీఐ పేర్కొంది. జగన్‌తో పాటు అధికారులందరూ కలిసి ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చారని, అందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో ఇందూ గ్రూపు రూ.50 కోట్ల ముడుపులను పెట్టుబడుల రూపంలో పెట్టిందని పేర్కొంది. ప్రాజెక్టువల్ల ప్రైవేటు వ్యక్తులే లబ్ధి పొందారని, అంతేగానీ ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ ప్రయోజనం చేకూరలేదంది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐఏఎస్‌ డి.మురళీధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున కె.సురేందర్‌ వాదనలు వినిపించారు. ‘ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదన్న కారణంగా కేసును కొట్టివేయాలని పిటిషనర్‌ కోరుతున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరంలేదు. ఐఏఎస్‌ అధికారి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి అవసరం. మేం అనుమతి కోరే నాటికి (2013)ఆయన ఐఏఎస్‌’ అని వివరించారు.

కంపెనీ లేకుండానే అనుమతులు

‘లేపాక్షి ప్రాజెక్టుకు సంబంధించి కంపెనీ దరఖాస్తు చేసుకునే నాటికి ఆర్వోసీలో కంపెనీ రిజిస్టర్‌ కాలేదు. రిజిస్టర్‌ కాని కంపెనీ పేరుతో భూకేటాయింపుల ఫైలు అధికారుల మధ్య చురుగ్గా కదిలి ఆమోదం పొందింది. జగన్‌ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులందరూ కలిసి ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించారు. భూములను తాకట్టు పెట్టుకోవడానికి, విక్రయించుకోవడానికి ఎన్వోసీ జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు 1.2 టీఎంసీల సోమశిల నీటి కేటాయింపులోనూ అక్రమాలు జరిగాయి’ అని సీబీఐ తరఫున కె.సురేందర్‌ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.

ఇదీ చదవండి..HC ON GO: జీవోలను వెబ్​సైట్​లో పెట్టకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details