ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంద్రకీలాద్రిపై ముగిసిన అనిశా తనిఖీలు.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక!

By

Published : Feb 23, 2021, 4:20 AM IST

ఇంద్రకీలాద్రిపై అనిశా తనిఖీలు ముగిశాయి. 5 రోజులపాటు కొనసాగిన తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించారు. ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిని ప్రభుత్వానికి అందజేయనున్నారు.

ఇంద్రకీలాద్రిపై అనిశా తనిఖీలు.. ప్రభుత్వానికి నివేదిక!
ఇంద్రకీలాద్రిపై అనిశా తనిఖీలు.. ప్రభుత్వానికి నివేదిక!

దుర్గగుడిలో ఈనెల 18న అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అప్పటినుంచి 5రోజులపాటు కొనసాగిన తనిఖీల్లో ప్రసాదాల కౌంటర్ల నుంచి అన్ని విభాగాల్లో సోదాలు చేశారు. నగదు కౌంటర్లలో ఉన్న లెక్కలను పరిశీలించారు. ఆలయంలోని పరిపాలన విభాగంలోనూ తనిఖీలు నిర్వహించారు. చీరల విభాగం, ఇంజినీరింగ్, సరకులు.. ఇలా అన్నింటికి సంబంధించిన ఫైళ్లు పరిశీలించారు. ఇటీవల వివాదాస్పదమైన సెక్యూరిటీ, శానిటేషన్‌ టెండర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఆలయానికి వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులు, ఉత్సవాలు, సిబ్బంది పదోన్నతులు ఇలా ప్రతి విషయానికి సంబంధించి జరుగుతున్న లోపాలపై ఆరా తీశారు. ఆదివారం రోజున దుర్గగుడిలోని కొందరు సిబ్బందిని గొల్లపూడిలోని అనిశా కార్యాలయానికి పిలిపించి విచారించారు. కీలకమైన ఫైళ్లను తెప్పించుకుని పరిశీలించారు. ఆలయంలో జరిగిన అవకతవకలపై సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలు తీసుకున్నారు. ఐదు రోజుల తనిఖీలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు.

గతంలో విజిలెన్స్‌ అధికారులు ఇంద్రకీలాద్రిపై అనేక లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈసారైనా దశాబ్దాలుగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న లోపాలపై దృష్టిపెట్టి.. శాశ్వతంగా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details