ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Delhi to Tirupati: దిల్లీ-తిరుపతి మధ్య తొలి నాన్‌స్టాప్‌ విమానం

By

Published : Oct 17, 2021, 9:52 PM IST

Updated : Oct 18, 2021, 5:39 AM IST

దిల్లీ, తిరుపతి మధ్య స్పైస్‌జెట్ విమాన సర్వీసు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. అక్టోబర్ 31 వరకు వారానికి మూడు రోజుల పాటు, 31 తర్వాత వారానికి నాలుగురోజుల పాటు సేవలు కొనసాగుతాయని ప్రకటించారు..

Delhi Flight
Delhi Flight

దేశ రాజధాని దిల్లీ నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి తొలిసారిగా స్పైస్‌జెట్‌ సంస్థ నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయమంత్రులు జనరల్‌ వీకేసింగ్‌, ప్రహ్లాద్‌పటేల్‌, స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌లతో కలిసి జెండా ఊపి ఈ విమానసేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్యసింధియా మాట్లాడుతూ తొలుత బుధ, శుక్ర, ఆదివారాల్లో సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31వ తేదీ నుంచి వారంలో నాలుగురోజుల పాటు సేవలు కొనసాగుతాయని ప్రకటించారు.

తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 2022 మే నాటికి రన్‌వే విస్తరణ పనులు పూర్తిచేసి వైడ్‌బాడీ అంతర్జాతీయ విమానాలు దిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘తిరుపతి దేశంలోని అత్యుత్తుమ వారసత్వనగరం, స్మార్ట్‌ సిటీకూడా. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఏటా 3.5 కోట్లమంది భక్తులు వస్తుంటారు. అక్కడ వేంకటేశ్వరుడితోపాటు దర్శించదగ్గ ఎన్నో ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాలున్నాయి. తిరుపతికి ఇప్పటికే ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, బెళగావి, కలబురిగి, కొల్హాపుర్‌ల నుంచి నేరుగా విమానాలున్నాయి. ఇప్పుడు తొలిసారిగా దిల్లీ నుంచి నేరుగా విమానం ప్రారంభమవుతోంది. 2,160 కిలోమీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లో చేరుకుంటుంది. దేశంలోని మధ్యతరహా, చిన్ననగరాలను విమానాలతో అనుసంధానం చేయాలని నిర్ణయించాం. 2024 నాటికి కొత్తగా 100 విమానాశ్రయాలు నిర్మిస్తాం. వెయ్యి నూతన మార్గాలు ప్రారంభిస్తాం. రైల్వే రెండో తరగతి ఏసీ ఛార్జీలకంటే తక్కువ ధరలకే విమానసేవలు అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం’’ అని జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు.

ఇదీ చదవండి:రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన చాలా గొప్పది: కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్

Last Updated :Oct 18, 2021, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details