ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెన్నా నదికి వరద.. తెగిపోయిన రోడ్లు.. విద్యార్థులకు కష్టాలు

By

Published : Sep 13, 2022, 5:36 PM IST

Penna Floods

Penna Floods Effect: పాలకులకు ముందుచూపు కొరవడితే.. ప్రజలు కష్టాలు, నష్టాలు అనుభవించాల్సిందే. గత ఏడాదిలో వరదలకు ముఖ్యమంత్రి సొంతజిల్లాలో వంతెనలు దెబ్బతిన్నా.. వాటిని బాగు చేయడంపై దృష్టి సారించలేదు. తాత్కాలిక చర్యలతో అప్రోచ్ రోడ్డు వేసి కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా వస్తున్న వరదకు రెండు ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లు తెగిపోవడంతో.. ప్రజల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. జమ్మలమడుగు వద్ద వంతెన దెబ్బతినడంతో విద్యార్థులు పాఠశాలలకు దూరమవుతున్నారు.

జమ్మలమడుగు వద్ద వంతెన దెబ్బతినడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

Penna Floods Effect: వైఎస్ఆర్ జిల్లాలో గత ఏడాది నవంబరులో వచ్చిన భారీ వరదలకు రెండు ప్రధాన ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయినా.. వాటిని బాగు చేయడంపై పాలకులు, అధికారులు దృష్టి సారించ లేదు. జమ్మలమడుగు వద్ద పెన్నానదిపై నిర్మించిన వంతెన గత ఏడాది కూలిపోయింది. దాదాపు 20 అడుగుల మేర ఓ పిల్లర్ కుంగిపోయింది. ఫలితంగా అధికారులు తాత్కాలికంగా పెన్నానదిలో వేశారు. 4 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని మాత్రమే తట్టుకునే విధంగా ఈ రోడ్డు నిర్మించారు. కానీ వంతెనలో కూలిపోయిన పిల్లర్​ను బాగు చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు.

నాలుగు రోజుల నుంచి కర్నాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెన్నానది భారీగా ప్రవహిస్తోంది. మైలవరం జలాశయం నుంచి 35 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. ఈ ప్రవాహం తాకిడికి అప్రోచ్ రోడ్డు కూడా తెగిపోయింది. ఫలితంగా జమ్మలమడుగు-ముద్దనూరుకు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు ఈ రెండు ప్రధాన పట్టణాల మధ్య రహదారి లేకపోవడం వల్ల సమీపంలోని 16 గ్రామాలకు పూర్తిగా రవాణా స్తంభించింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గండికోట, గూడెంచెరువు, రాజీవ్ నగర్ కాలనీ, కొట్టాలపల్లె, అంబవరం, చిటిమిటిచింతల, ఒంటెమిద్దె, కొత్తగుంటపల్లె తదితర గ్రామాల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు జమ్మలమడుగులోని హైస్కూళ్లు, కళాశాలలకు వెళ్తుంటారు. ఐదు రోజుల నుంచి విద్యార్థులు బడికి వెళ్లటం లేదు. మరికొందరు అతికష్టం మీద మైలవరం డ్యాం చుట్టూ తిరిగి ఆటోళ్లో రోజుకు 200 రూపాయలు ఖర్చు చేసి కళాశాలలకు వెళ్తున్నారు . ఇంత మొత్తంలో చెల్లించి కళాశాలలకు పంపించటం ఇబ్బంది కావడంతో తల్లిదండ్రులు వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఈ వంతెన బాగుచేస్తే తమ చదువులు బాగుపడతాయని.. లేదంటే ప్రతిసారి ఈవిధంగా వందల రూపాయలు ఆటోలకు వెచ్చించాల్సి రావడం భారంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఈ రోడ్లు తెగిపోవటం వల్ల డ్యాం చుట్టూ తిరిగి రావటానికి సమయం వృథా అవుతోంది. ఇంతకముందు కళాశాలకు అర్ధగంటలో వచ్చే వాళ్లం. ఇప్పుడు అర్ధగంటకు మించి సమయం పడుతోంది. సాయత్రం ఇంటికి వెళ్లే సరికి అలస్యం అవుతోంది. దీనివల్ల మాకు ఇంటి దగ్గర చదువుకోవటానికి సమయం దొరకటం లేదు". - కళాశాల విద్యార్థులు

"జమ్మలమడుగు వద్దనున్న వంతెన తెగిపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. విద్యార్థులు జమ్మలమడుగులోనే ఉండే విధంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం". -జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు

ఇదిలా ఉంటే కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెన కూడా గత ఏడాది నవంబరులో వచ్చిన వరదలకు తెగిపోయింది. దీన్ని నిర్మాణం చేయకుండా.. పక్కనే 4 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టారు. ఆ రోడ్డు కూడా పది రోజుల కిందట పాపాగ్నికి వచ్చిన వరదల వల్ల తెగిపోయింది.

"వరద తగ్గిన తర్వాత మళ్లీ తాత్కాలిక రోడ్డు వేస్తున్నారు. ఎన్నిసార్లు ఈవిధంగా తాత్కాలిక చర్యలతో సరిపెడతారు. ఏడాది అవుతున్నా ఎందుకు వంతెనలు నిర్మాణం చేపట్టలేకపోతున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి". -కమలాపురం వాసులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details