ఆంధ్రప్రదేశ్

andhra pradesh

KADAPA RAINS: తగ్గిన చెయ్యేరు నది వరద ప్రవాహం.. నేడు విద్యాసంస్థలకు సెలవు

By

Published : Nov 20, 2021, 7:55 AM IST

కడప జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. నేడు వరద ప్రభావిత గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా అధికార బృందాలు సర్వే చేపట్టనున్నాయి. జిల్లాలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

KADAPA RAINS
KADAPA RAINS

కడప జిల్లా(kadapa rains) చెయ్యేరు నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావిత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల(NDRF) ఇప్పటికే సహాయక చర్యలు అందిస్తున్నాయి. వరద ప్రభావిత గ్రామాల్లో హెలికాప్టర్ ద్వారా అధికార బృందాలు సర్వే చేపట్టనున్నాయి. పంట నష్టం, వరద పరిస్థితులపై వారు అంచనా వేస్తారు. జిల్లాలో నేడు కూడా విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

వరద బీభత్సం(heavy rains in kadapa district)తో కడప నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. నగరం నడిబొడ్డున ప్రవహిస్తున్న బుగ్గవంక ఉగ్రరూపం దాల్చింది. బుగ్గవంక పరివాహక ప్రాంతాల నివాసాలను వరద నీరు చుట్టుముట్టింది. దాదాపు 250 నివాసాలను పోలీసులు ఖాళీ చేయించారు. బుగ్గవంక పరివాహక చుట్టు వేసిన మట్టి కట్టలు పలుచోట్ల తెగిపోయాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కొంతమంది ఏకంగా నివాసాలకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. నగరంలో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వరదనీటిలో 3 ఆర్టీసీ బస్సులు- 12 మంది మృతి

రాజంపేట మండలం రామాపురంలో వరదనీటిలో 3 ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 12మంది మృతి చెందారు. వారి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు. పలువురిని రక్షించారు.

నీట మునిగిన పంటలు

కమలాపురం వద్ద పాపాగ్ని నది ఉద్ధృతి పెరగటంతో పంటలు నీట మునిగాయి. నదీ ప్రవాహంలో 100 గొర్రెలు కొట్టుకుపోయాయి. కమలాపురం-ఖాజీపేట మార్గంలో పాగేరు వంతెనపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వెలిగల్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాపాగ్నికి భారీగా వరద వస్తోంది.

పొంగుతున్న వాగులు...

జిల్లాలో భారీ వర్షాలకు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కట్టలు తెగిపోయాయి. మాండవ్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్నమండెం రాయచోటి వీరబల్లి మండలాల పరిధిలో నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగింది. నీటి ఉద్ధృతికి భూములు కోతకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడగా... సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఆలయంలోకి నీరు...

నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. నందలూరు - హస్తవరం దారిలో రైలు మార్గం కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతికి లక్కిరెడ్డిపల్లి ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. గుండ్లూరు, చొప్పావారిపల్లె, కోనరాజుపల్లి గ్రామాలు నీట మునిగాయి.

పులివెందులలో భారీ వర్షం..

పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డ్యాములు చెరువులు వాగులు వంకలు నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పులివెందుల మండలంలోని ఎర్రబెల్లి చెరువుకు వరద నీరు పోటెత్తడంతో చెరువు నుంచి భారీ స్థాయిలో నీరు మరువ పారడంతో ఎర్రపల్లి తండా ఎర్రబలే గ్రామం వంక పరివాహక ప్రాంతాలైన ఎర్ర గుడి పల్లె ఇస్లాం పురం రోటరీపురంలో వరద నీరు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో అధికారులు అప్రమత్తమై ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. పులివెందుల మండలం మోటు నూతన పల్లె గ్రామాన్ని ముంచెత్తుతున్న వరద నీరు ఆ గ్రామంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తున్నది. జిల్లా యంత్రాంగం అధికారులను 24 గంటలూ అప్రమత్తంగా ఉంచుతూ.. ప్రజలకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంది.

40 మంది గల్లంతు!

రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహం కొనసాగుతోంది. అన్నమయ్య జలాశయం వద్ద ఎర్త్ బండ్ పూర్తిగా కొట్టుకుపోయింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీట మునిగాయి. సుమారు 30 నుంచి 40 మంది గల్లంతయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. నందూలూరు - రాజంపేట రైల్వే ట్రాక్ కి.మీ మేర కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వంతెనపై భారీగా వరద ప్రవాహం పెరిగింది. చెయ్యేరు నదిలో 16 మంది గల్లంతయ్యారు.

ప్రత్యేక అధికారుల నియామకం..

భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న, కడప జిల్లాకు సీనియర్‌ అధికారి శశిభూషణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది.

ఉద్ధృతంగా పాపాగ్ని నది..

భారీగా కురుస్తున్న వర్షాలకు చక్రాయపేట మండలం అద్దాలమర్రి క్రాస్​ వద్ద ఉన్న బ్రడ్జిపై పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కే ఎరగుడి బీఎన్​ తాండా , గరుగు తాండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతువంక వద్ద బ్రడ్జి తెగింది. దాంతో అటువైపు ఎవరు రావొద్దని పోలీసులు తెలిపారు. మోమురు వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రామిరెడ్డి పల్లెకి రాకపోకలు నిలిచిపోయాయి. రామిరెడ్డి పల్లెలో వరద ఇళ్లలోకి చేరింది. కాలేటి వాగు కట్ట తెగిపోయేలా ఉంది. వర్షం ప్రభావంతో రాత్రి నుంచి కరెంట్​ లేక రామిరెడ్డి పల్లె చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి పాదాలను వర్షపు నీరు తాకింది.

రైల్వే కోడూరు..

కడప జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గంలో నిన్న కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. రైల్వే కోడూరు మండలం బాల పల్లి వద్ద శేషాచలం అడవుల నుంచి ఉద్ధృతంగా వర్షపు నీరు ప్రధాన రహదారిపై ప్రవహించడంతో తిరుపతి నుంచి రైల్వేకోడూరు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. చిట్వేలు మండలం ఎల్లమరాజు చెరువు నిండి ఆలు ఉద్ధృతంగా ప్రవహించడంతో చిట్వేలి - నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీట మునిగాయి. రైల్వేకోడూరువద్ద గుంజన ఏరు ఉద్ధృతంగా ప్రవహించడంతో సమీపంలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైల్వేకోడూరు నుంచి రెడ్డివారిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలో తమలపాకులు, అరటి, బొప్పాయి పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈరోజు ఉదయం నుంచి వర్షం తీవ్రత తగ్గడంతో కొంతవరకు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నందలూరు నది ఉద్ధృతంగా ప్రవహించడంతో రైల్వేకోడూరులో క్రాంతి ఎక్స్​​ప్రెస్​, చెన్నై ఎక్స్​ప్రెస్​ రైళ్లు నిలిపివేశారు. పెనగలూరు మండలంలో పింఛ, అన్నమయ్య డ్యాం కట్టలు తెగిపోవటం వలన వచ్చిన నీటి ఉద్ధృతికి పెనగలూరు మండలాలలో పలు గ్రామాలు జలమయం అయ్యాయి. ఎంఆర్​ పురం, పల్లపాడు గ్రామాలు నీటమునిగాయి. కొండూరు, సింగణమల, ఈటీ మార్పూరం, ఎన్​ఆర్​ పురం పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.

రాయచోటి నియోజకవర్గం..

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయచోటి నియోజకవర్గం లోని లక్కిరెడ్డిపల్లె రామాపురం, సంబేపల్లి గాలివీడు మండలాల్లో వేరుశనగ వరి ఇతర కూరగాయల పంటలు నీటమునిగాయి. మధ్య కల్వర్టులు తెగిపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. మాండవ్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాయచోటి పట్టణం శివారు ప్రాంతాల్లో సుమారు 10 ఇల్లు నేలకూలాయి. ఇళ్లలోని వారు అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. రాయచోటి లక్కిరెడ్డిపల్లె వేంపల్లి - పులివెందుల మధ్య మద్ది రేవుల వంక పై నిర్మించిన వంతెన తగ్గిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయచోటి పట్టణ సమీపంలోని కంచాలమ్మ గండి చెరువు గాలివీడు పెద్ద చెరువు ప్రమాదకరస్థాయిలో అలుగులు పారుతున్నాయి. రాయచోటి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత కేంద్రాలకు తరలించారు.

వరద నీటిలో మునిగిన వాహనాలు..

రాజంపేట మండలం చొప్పవారిపల్లి వద్ద వరద పోటెత్తుతోంది. ఈ తీవ్రతకు రోడ్లు పూర్తిగా నీటమునిగాయి. ఆ మార్గంలో వెళ్లే బస్సులు రోడ్డుపై ఆగిపోయాయి. వెనక్కి వెళ్లలేక, ముందుకు కదల్లేక ఇరుక్కుపోయాయి. బస్సుల్లోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కార్లు, ఇతర వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. పంట పొలాలు చెరువుల్లా మారాయి. ఈ పరిస్థితి ఎన్నడూ చూడలేదని, వాన తీవ్రతకు ఊరూ - ఏరూ ఏకమయ్యాయని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు బయటపడతామో తెలియడం లేదని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు.

ఇదీ చదవండి:

Floods: కడపజిల్లాలో విషాదం.. వరదల్లో గల్లంతై 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details