ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rains: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు

By

Published : Nov 12, 2021, 8:50 PM IST

Updated : Nov 13, 2021, 3:43 AM IST

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పంటచేలు నీటమునిగాయి.

వర్షాలు
వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి. చిత్తూరు జిల్లాలో రహదారులు కోసుకుపోవడం, వంతెనలు కొట్టుకుపోవడం, చెరువులకు గండ్లు వంటి నష్టం వాటిల్లింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. శుక్రవారం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. తిరుపతి నగరంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట, వరదయ్యపాళెం, కె.వి.బి.పురం, సత్యవేడు, నారాయణవనం, చిత్తూరు మండలాల్లో 1,315 మందికి పునరావాసం కల్పించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు గల్లంతుకాగా ఒకరు చనిపోయారు. ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో సుమో అదుపుతప్పి రహదారి పక్కనున్న చెరువులో బోల్తాపడగా ప్రయాణికులను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
* జిల్లాలో అత్యధికంగా కె.వి.బి.పురంలో 36 గంటల వ్యవధిలో 18 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా 10 సెం.మీ పైగా 15 మండలాల్లో వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సగటు వర్షపాతం 70.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.

తిరుమల కనుమ రహదారుల మూసివేత
వర్షాలు కురుస్తుండటంతో శుక్రవారం రాత్రి 8గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి నడకమార్గాన్ని వర్షాల కారణంగా శుక్రవారం మూసివేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించారు. తిరుమలలోని అన్ని డ్యాంలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

* నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాకపోకలు నిదానంగా సాగాయి. స్వర్ణముఖి ప్రవాహంతో పెళ్లకూరు మండలంలో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజీ నుంచి 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. పడమట పల్లెలు, పులికాట్‌లోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సోమశిల జలశయానికి వరద పోటెత్తుతోంది.
* కడప జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 17,838 ఎకరాల్లో వ్యవసాయ, 3,276 ఎకరాల్లో ఉద్యాన పంటలు, వరి పంట 16,335 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. పుల్లంపేట మండలంలో పుల్లంగేరుపై ఉన్న పాత దిగువ వంతెన కొట్టుకుపోయింది.

* వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి పైరు నీట మునిగింది. మరో రెండురోజులు వానలు పడితే పంట చేతికొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు.
* పశ్చిమగోదావరిలో గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. జిల్లావ్యాప్తంగా సగటున 13 మి.మీ. వర్షపాతం నమోదైంది. 22 వేల ఎకరాల్లో వరి నేలవాలింది. 115 ఎకరాల్లో మినుము పంట దెబ్బతింది.


భారీ వర్షాలకు ధర్మపురి జిల్లా వేముత్తంపట్టి ప్రాంతంలో పట్టాలపై బండరాళ్లు పడటంతో కన్నూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం వేకువజామున పట్టాలు తప్పింది. 5బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నేడు మరో అల్పపీడనం
దక్షిణ అండమాన్‌ సముద్రంలో శనివారం(13న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లోనూ పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి:LIVE VIDEO : కాసేపైతే జలసమాధే.. వరదలో కొట్టుకుపోతున్న ముగ్గురిని కాపాడారు!

Last Updated : Nov 13, 2021, 3:43 AM IST

ABOUT THE AUTHOR

...view details