ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Buggavanka: నిండుకుండలా బుగ్గవంక..ఆందోళనలో పరిసర ప్రాంత ప్రజలు

By

Published : Nov 13, 2021, 3:53 PM IST

Buggavanka
బుగ్గవంక వరద ముంపుపై అధికారుల ముందస్తు చర్యలు

భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కడపలోని బుగ్గవంక పరివాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. వరద ముంపు ఎప్పుడు ఇళ్లను ముంచెత్తుతుందోననే ఆందోళన వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఈసారి అధికారులు తాత్కాలిక ముందస్తు చర్యలకు ఉపక్రమించడం ప్రజలకు కొంత ఊరటనిస్తోంది.

బుగ్గవంక వరద ముంపుపై అధికారుల ముందస్తు చర్యలు

భారీ వర్షాలు వస్తున్నాయంటే కడపలోని బుగ్గవంక పరివాహక ప్రాంత ప్రజలకు ఆందోళన అంతా ఇంతా కాదు.. వరద ముంపు ఎప్పుడు ఇళ్లను ముంచెత్తుతుందోనన్న భయం వారిని నిద్రపోనీయదు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. కానీ ఈసారి అధికారులు తీసుకున్న చర్యలు ప్రజలకు కొంత ఊరటనిస్తోంది.

రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భారీ వరదలు బుగ్గవంక పరివాహక ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. గతేడాది వచ్చిన నివర్‌ తుపానుతోనూ నివాసాల్లోకి వరద నీరు చేరి కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రమాద హెచ్చరికలు బుగ్గవంకను పలకరిస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. సీకే దిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు సామర్థ్యం కేవలం అర టీఎంసీ మాత్రమే. తక్కువ వర్షం వచ్చినా ప్రాజెక్టు నిండిపోతుంది. గేట్లు ఎత్తి నీటిని వదిలితే కడప నగరంలో బుగ్గవంక నాలుగు కిలోమీటర్ల మేర ప్రవహించి పెన్నానదిలో కలుస్తుంది.

బుగ్గవంక ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే సూచనలు ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బుగ్గవంక ప్రవహించే నాలుగు కిలోమీటర్ల పరిధిలో... ఇరువైపుల రక్షణ గోడలు లేని ప్రాంతంలో ఇసుక బస్తాలు, మట్టి దిబ్బలు, రాళ్లను అడ్డుకట్టలుగా వేస్తున్నారు. ఈసారి వరద వచ్చినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

" మూలవంక ప్రవహించినపుడు..బుగ్గవంక నుంచి వచ్చే వాగు నీరు కలవకుండా బఫర్లు మొదలు పెట్టాం. కడప టౌన్ లోకి నీరు రాకుండా ఇసుక బస్తాలను, మట్టిదిబ్బలు, రాళ్లను అడ్డుకట్టలుగా వేశాం. సుమారు 12 ఎర్త్ ఎస్కవేటర్లు బుగ్గవంక చూట్టూ 4కిలోమీటర్ల పరిధిలో పని చేస్తున్నాయి. బుగ్గవంక నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొన్ని పనుల కోసం రీటెండర్లకు వెళ్లాం. అది అయ్యేలోపు కడపలో ఎటువంటి నష్టం కలగకుండా ఈ జాగ్రత్తలన్నీ కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టాము." - శ్రీనివాసులు, ఎస్ఈ, జలవనరులశాఖ

బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో రక్షణ గోడలు లేని ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరైనా.. అవి ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈసారి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.

బుగ్గవంకకు ఎప్పుడు వరద వచ్చినా సీకే దిన్నె సమీపంలోని మూలవంక నుంచి నీరు వచ్చి కలుస్తుండటంతో ప్రమాదకరంగా ఉండేది. అయితే ఈసారి మూలవంక నీరు బుగ్గవంకలోకి రాకుండా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి :

సీఎం సొంత జిల్లాలో రోడ్డు బాగోలేదు.. వైకాపా కార్పొరేటర్ నిరసన!

ABOUT THE AUTHOR

...view details