ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

By

Published : Apr 29, 2022, 3:08 PM IST

Updated : Apr 30, 2022, 3:33 AM IST

Guntur district special court verdict on Btech Student Ramya murder case

15:04 April 29

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..
గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష ఖరారు..

ప్రేమోన్మాదంతో ఓ యువతిని బలిగొన్న కిరాతకుడికి ఉరే సరైనదని కోర్టు తీర్పు చెప్పింది. ఇంజినీరింగ్‌ విద్యార్థిని నల్లపు రమ్య (20) దారుణ హత్య కేసులో నిందితుడు శశికృష్ణ (19)కు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.రాంగోపాల్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకల రోజు గుంటూరు నగరంలో పట్టపగలు.. నడిరోడ్డుపై రమ్యను ప్రేమోన్మాది కిరాతకంగా హతమార్చిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్యకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. కూలి పనులకు వెళ్లే ఆ యువకుడితో కొద్దిరోజుల పాటు స్నేహంగా మాట్లాడిన రమ్య అతను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో నిరాకరించింది. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గతేడాది ఆగస్టు 14న స్నేహితుడితో కలిసి కళాశాలకు వెళ్లి రమ్యతో మాట్లాడటానికి ప్రయత్నించగా.. ఆమె మాట్లాడలేదు. మరింత కోపం పెంచుకున్న శశికృష్ణ మరుసటి రోజు ఆమె ఇంటి సమీపంలో మాటు వేశాడు. ఉదయం 9.40 గంటలకు రమ్య అల్పాహారం కోసం బయటకు రాగా హోటల్‌ వద్ద మరోసారి ఘర్షణ పడి.. తన వద్ద ఉన్న కత్తితో దారుణంగా పొడిచాడు. స్థానికులు వెంటనే బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పాతగుంటూరు పోలీసులు అదేరోజు సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశారు. డీఎస్పీ రవికుమార్‌ కేసు దర్యాప్తు చేసి 36 మంది సాక్షులను విచారించి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. హోటల్‌ వద్ద సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాలు కేసు విచారణలో కీలకంగా మారాయి. మొత్తం 28 మంది సాక్షులను న్యాయమూర్తి రాంగోపాల్‌ విచారించారు. గతేడాది డిసెంబరు 7న విచారణ ప్రారంభమైన ఈ కేసులో 9 నెలల్లోపే నిందితుడికి శిక్ష పడింది.

తండ్రికి చెవుడు.. తల్లికి ఆస్థమా

శుక్రవారం ఉదయం 12 గంటల సమయంలో న్యాయమూర్తి రాంగోపాల్‌ కేసు విచారణ చేపట్టారు. నిందితుడిపై నేరం రుజువైందని తెలిపారు. అనంతరం శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా? అని నిందితుణ్ని ప్రశ్నించగా తన తండ్రి చెవిటి వాడని, తల్లి ఆస్థమాతో బాధపడుతోందని, వారిద్దరిని తాను చూసుకోవాల్సి ఉందని తెలిపాడు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శారదామణి తన వాదనలు వినిపిస్తూ పట్టపగలు విద్యార్థినిని దారుణంగా హతమార్చిన శశికృష్ణ ఉరిశిక్షకు అర్హుడని అన్నారు. అయితే అతడిలో మార్పు రావటానికి అవకాశం ఉందని డిఫెన్స్‌ న్యాయవాది మార్కండేయులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శిక్షపై నిర్ణయాన్ని మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.

కోర్టు వద్ద ఉత్కంఠ

శుక్రవారం ఉదయం నుంచి కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, అదనపు ఎస్పీ గంగాధరం, డీఎస్పీ సీతారామయ్య తదితరులు కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.45 గంటలకు న్యాయమూర్తి రాంగోపాల్‌ తీర్పు వెలువరిస్తూ నిందితుడి విషయంలో ఎలాంటి కనికరం చూపించాల్సిన అవసరం లేదని, ప్రేమను నిరాకరించిందని దారుణంగా పట్టపగలు హతమార్చటం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు అతడి ప్రవర్తన కూడా సరిగాలేదని, కేసు విచారణ సమయంలో కోర్టు హాల్లోంచి పారిపోవటానికి ప్రయత్నించాడని, ఉదయం శిక్ష గురించి ప్రశ్నించగా అతని స్వరంలో, ప్రవర్తనలో ఎలాంటి దైన్యం కనబడలేదని వివరించారు. శశికృష్ణకు ఉరిశిక్షతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద జీవిత ఖైదు, ఇతర నేరాల కింద కూడా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఉరిశిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారం సరిపోతుందని తెలిపారు. శిక్షలు సులభంగా అర్థమయ్యేలా దోషి శశికృష్ణకు తెలుగులో వివరించారు.

తెలంగాణలో దిశ చట్టం, యాప్‌ లేనేలేవు: హోం మంత్రి తానేటి వనిత

రమ్య హత్య కేసులో 10 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశామని, 8 నుంచి 9 నెలల కాలంలో కోర్టు తీర్పు వచ్చిందని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. విశాఖలో ఆమె విలేకరులతో మాట్లాడారు. నిర్భయ కేసు కంటే త్వరితగతిన కోర్టు తీర్పు రావటం గమనార్హమన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ. 1.60 కోట్ల విలువ చేసే భూమి, ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో దిశ చట్టం తీసుకొచ్చామన్నారు. దిశ యాప్‌ ద్వారా 900 మంది మహిళలను పోలీసులు రక్షించారని తెలిపారు. దిశ సంఘటన జరిగిన తెలంగాణలో ఈ చట్టం కానీ, యాప్‌ కానీ తీసుకురాలేదని వ్యాఖ్యానించారు.

అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇది గట్టి సందేశం: సీఎం జగన్‌

రమ్య హత్య కేసులో తీర్పును స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ‘దిశ’ స్ఫూర్తిని ప్రదర్శించారని పేర్కొన్నారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నిందితుడికి శిక్ష పడేలా పోలీసులు, ప్రాసిక్యూషన్‌ న్యాయవాది కృషి చేశారంటూ వారికి అభినందనలు తెలిపారు. ‘మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పింది. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ కోర్టు తీర్పు గట్టి సందేశాన్ని పంపించింది. ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి దోషులకు కఠినంగా శిక్ష పడేలా కృషిచేయాలి’ అని జగన్‌ పేర్కొన్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి :Guntur Rape and Murder Case: 'పోలీసులు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'

Last Updated :Apr 30, 2022, 3:33 AM IST

ABOUT THE AUTHOR

...view details