ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హైదరాబాద్‌ చేరుకున్న యశ్వంత్‌ సిన్హా.. తెరాస ఘన స్వాగతం

By

Published : Jul 2, 2022, 11:57 AM IST

Yashwant Sinha Hyderabad Tour: రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు తెరాస ఘనంగా స్వాగతం పలికింది. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వరకు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహిస్తారు.

Yashwant Sinha Hyderabad Tour
Yashwant Sinha Hyderabad Tour

Yashwant Sinha Visit To Hyderabad: రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా తెరాస ఘనంగా ఏర్పాట్లు చేసింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్, పార్టీ ముఖ్యనేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డులో జలవిహార్ వరకు భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. ప్రధాని సహా భాజపా అగ్రనేతలందరూ ఇవాళ నగరంలోనే ఉంటున్నందున.. గులాబీ దళం బల ప్రదర్శన తరహాలో సన్నాహాలు చేసింది.

సుమారు ఆరు వేలకు పైగా ద్విచక్రవాహనాలతో ప్రదర్శన ఉంటుందని తెరాస నేతలు వెల్లడించారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస సభ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. సుమారు 230 మంది సభలో పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు మద్దతుపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.

ఓ వైపు నగరంలో భాజపా సమావేశాలు... మరోవైపు జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్.... జలవిహార్ వేదికగా కీలక విషయాలను ప్రస్తావించే అవకాశముందని తెరాస వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ తర్వాత తనకు మద్దతివ్వాలని కోరుతూ యశ్వంత్ సిన్హా ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత జలవిహార్‌లోనే కేసీఆర్, తెరాస నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేస్తారు. జలవిహార్ సమావేశానికి కేవలం తెరాస నేతలే హాజరవుతారని.. యశ్వంత్ సిన్హాకు మద్దుతిస్తున్న కాంగ్రెస్, ఎంఐఎం నాయకులెవరూ పాల్గొనబోరని పార్టీ నేతలు స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం, సభ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతలను నగర నేతలకు తెరాస అప్పగించింది. ఏర్పాట్లు ఘనంగా చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఘనంగా స్వాగత ఏర్పాట్లు: యశ్వంత్ సిన్హాకు స్వాగతం తెలుపుతూ రాష్ట్ర అభినృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఇప్పటికే నగరమంతటా ఫ్లెక్సీలు, పోస్టర్లను గులాబీ పార్టీ నింపింది. యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లను కూడా ఘనంగా చేసింది. బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు యశ్వంత్ సిన్హా, కేసీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు, కటౌట్‌లను ప్రదర్శించారు. మరోవైపు బేగంపేట విమానాశ్రయం, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించనున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details