ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాలంటీర్లతో ‘సాక్షి’ కొనిపించేందుకే నెలకు రూ.200.. తెదేపా నేత యనమల ధ్వజం

By

Published : Jul 7, 2022, 7:54 AM IST

Yanamala fires on YSRCP: ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి సొంత పార్టీ కార్యకర్తలైన గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రజల సొమ్మును సీఎం జగన్‌ దోచి పెడుతున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వార్తా పత్రికల కొనుగోలుకు ఒక్కో వాలంటీరుకు నెలకు రూ.200 చొప్పున ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి, వారితో సొంత పత్రిక సాక్షిని కొనుగోలు చేయించి, ఆ డబ్బును జగన్‌ తన సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు.

Yanamala Ramakrishnudu fires on YSRCP government
వైకాపాపై తెదేపా నేత యనమల ధ్వజం

Yanamala fires on YSRCP: ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసి సొంత పార్టీ కార్యకర్తలైన గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రజల సొమ్మును ముఖ్యమంత్రి జగన్‌ దోచి పెడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వార్తా పత్రికల కొనుగోలుకు ఒక్కో వాలంటీరుకు నెలకు రూ.200 చొప్పున ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి, వారితో సొంత పత్రిక సాక్షిని కొనుగోలు చేయించి, ఆ డబ్బును జగన్‌ తన సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు.

‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేసే ఉద్యోగుల్ని జగన్‌రెడ్డి బానిసల్లా చూస్తున్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదు. మూడేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగులు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుకున్న సందర్భాలు అరుదు. రివర్స్‌ పీఆర్‌సీతో అప్పటి వరకు ఇస్తున్న జీతాల్లోనే కోత విధించారు. డీఏలు, అలవెన్సులు లేవు. ఉద్యోగులకు అన్యాయం చేస్తూ... తన పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నారు’ అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

‘ వాలంటీర్లకు సేవారత్న, సేవా వజ్ర అంటూ అవార్డుల పేరుతో రూ.485.44 కోట్లు పంచిపెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలోని 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు వార్తాపత్రికల కొనుగోలుకు ప్రతి నెలా రూ.200 చొప్పున నెలకు రూ.5.50 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. వారితో సాక్షి పత్రికను కొనుగోలు చేయించడం ద్వారా ఆ డబ్బు జగన్‌రెడ్డి సొంత ఖజానాకు చేరుతుంది. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటున్న జగన్‌రెడ్డి తన సొంత పత్రికను పార్టీ కార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా? ఆయన ఏం చేసినా ప్రభుత్వ ఖజానాని తను, తన మనుషులు దోచుకునేందుకేనన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు.

సొంత పత్రికకు రూ.కోట్లు దోచిపెడుతున్నారు..ప్రజలకు ఉపయోగపడే విదేశీ విద్య, అన్న క్యాంటీన్లు, ముస్లిం యువతులకు దుల్హన్‌ పథకం, బీసీలకు ఆదరణ పనిముట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధినిచ్చే కార్పొరేషన్‌ రుణాల వంటి వాటిని రద్దు చేసిన జగన్‌రెడ్డి.. తన సొంత పత్రికకు రూ.కోట్లు దోచిపెడుతున్నారని యనమల పేర్కొన్నారు.

‘మరోవైపు ప్రభుత్వం ప్రజలపై పన్నుల రూపంలో మోయలేని భారాల్ని మోపుతుండగా... ఆ మొత్తాల్ని జగన్‌రెడ్డి సొంత పత్రికకు, టీవీ ఛానల్‌కు మళ్లిస్తున్నారు. ప్రజలకు చేస్తున్న వాటి కంటే దాని గురించి ప్రచారం చేస్తూ తన సొంత పత్రికకు ప్రకటనల రూపంలో దోచి పెడుతున్నదే ఎక్కువ’ అని ఆయన దుయ్యబట్టారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details