ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రపంచ ఆలయాల్లో యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది: తెలంగాణ సీఎం

By

Published : Mar 12, 2021, 8:53 PM IST

తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రం పునః ప్రారంభం కోసం.. తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. క్యూలైన్లను వచ్చే నెల 15 నాటికి ఏర్పాటు చేయాలని గడువు విధించారు. క్యూలైన్​ ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాను ఖరారు చేశారు. ప్రాకారం, శివాలయం, రథశాల తదితరాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎటునుంచి చూసినా దేవాలయం సుందరంగా కనిపించే విధంగా తీర్చిదిద్దాలన్నారు.

telangana cm kcr review on yadadri temple works
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష

పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమవుతున్న తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రం.. అద్భుత రూపంతో ప్రపంచ దేవాలయాల్లోనే ప్రత్యేకతను చాటుకోబోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్​లతో ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. యాదాద్రి పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం ఉండేలా అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు.

యాదాద్రి ఆలయంపై వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలు

పనుల పురోగతిపై ఆరా

స్వామి వారి ఆలయాన్ని త్వరలోనే పున: ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. గడువులోగా తుది మెరుగులు దిద్దే పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనుల పురోగతిని ఆరా తీశారు. క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ విషయమై సూచనలు చేశారు. 350 అడుగుల పొడవైన క్యూలైన్ల నిర్మాణాన్ని.. ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని కేసీఆర్ తెలిపారు. క్యూలైన్ల పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను పరిశీలించి... నాలుగింటిలో ఒకదాన్ని ఖరారు చేశారు. ఉత్తర దిక్కున ప్రహరీ గోడను తొలగించి.. ఏప్రిల్ 15 లోపు అక్కడ మరో క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని గడువు విధించారు.

గుడి కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్​లు

టెంపుల్ ఎలివేషన్​తో..

'దీప స్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్దడంతో పాటు పెడస్టల్​కు ఇత్తడితో ఆకృతులను బిగించాలి. శివాలయ ప్రహరీ గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను అమర్చాలి. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి.. గుడి కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్​లు ఏర్పాటు చేయాలి. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలి. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం అమర్చిన తరహాలోనే శివాలయం చుట్టూ త్రిశూలం కనిపించేలా ఏర్పాట్లు చేయాలి. రథశాలను టెంపుల్ ఎలివేషన్​తో తీర్చిదిద్దాలి.'

- కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఆలయంపై విద్యుత్ దీపాల వెలుగులు

వెలుగులతో ప్రకాశించేలా..

విష్ణు పుష్కరిణి, కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. 80 అడుగులు పొడవున్న దీపస్తంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలని చెప్పారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమవుతోందని కితాబు ఇచ్చారు. చివరి అంకం చేరుకున్న ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయం, ప్రాంగణాల చుట్టూ, పరిసరాలు దివ్యమైన వెలుగులతో ప్రకాశించేలా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను ముఖ్యమంత్రి తిలకించారు.

యాదాద్రి ఆలయం

అద్భుత రూపాన్ని సంతరించుకుంటోంది

'పునర్నిర్మాణం తర్వాత ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. వందశాతం రాతి కట్టడాలతో, కృష్ణ శిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి దేవాలయం.. అద్భుత రూపాన్ని సంతరించుకుంటోంది. పున:ప్రారంభం తర్వాత లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలి.'

- కేసీఆర్​, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

దేశభక్తిని పెంపొందించేలా అమృత్ మహోత్సవాలు: సీఎం

ABOUT THE AUTHOR

...view details