ఆంధ్రప్రదేశ్

andhra pradesh

varalakshmi vratam: సౌభాగ్యం, సిరిసంపదలిచ్చే శ్రావణలక్ష్మి

By

Published : Aug 20, 2021, 8:52 AM IST

శ్రావణం వానలతో పాటు శుభకార్యాలు, పండగలూ, వ్రతాల కాలం. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున కుంభవృష్టి కురిసినా, చిత్తడివానే పడుతున్నా... స్త్రీలు పట్టుచీరలు కట్టి, తలలో పూలు, కళ్ల నిండా కాటుక, పాదాలకు పసుపు పెట్టుకుని... వాయనాలు అందిస్తూ, అందుకుంటూ సందడి చేస్తారు. సౌభాగ్యం, సిరిసంపదలు ఇవ్వమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు.

varalaxmi
varalaxmi

సర్వ మంగళ మాంగల్యే

శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవి

నారాయణి నమోస్తుతే!

అంటూ మహిళలంతా లక్ష్మీదేవిని శ్రద్ధగా స్మరించుకునే... శ్రావణ వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. అప్పుడు కుదరని వారు తర్వాత వచ్చే వారాల్లోనూ చేసుకోవచ్చు. ఇది మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందుకే ఈ రోజు ఏ ఇంట చూసినా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తుంది.

సకల సంపదలకూ ప్రతీక లక్ష్మీదేవి. ఆవిడ ఏ మంచిని కోరినా అనుగ్రహించే తల్లి. అందుకే అందరితోనూ వరలక్ష్మిగా పిలిపించుకుంటోంది. ఆవిడ ప్రతిరూపంగా భావించే స్త్రీలు తమపై కరుణ కురిపించాలని కోరుతూ సిరిమహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. అత్తలు...కొత్త కోడళ్లతో ఈ వ్రతం చేయించడం ద్వారా ఆమెకు పూజలు, వాటి విధానాల ప్రాముఖ్యం తెలిసేలా చేస్తారు. శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేయాలనేది నియమం. అందుకే నవ వధువులకు అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తయిదువులు లక్ష్మీరూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తర్వాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు మదుపు అవుతుంది.

వరలక్ష్మి వ్రతం విశేషాలు..

వరలక్ష్మీదేవి వ్రత కథలోని చారుమతి... పేరుకు తగ్గట్టే మంచి బుద్ధితో అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంది. మితభాషణం ఆమెకి అలంకారం. అందరినీ కలుపుకొనిపోయే తత్వం ఆభరణం. ఇందులో ఆమె తాను మాత్రమే వ్రతం చేసుకోవాలనుకోకుండా.... తోటి వారికీ మంచి జరగాలని కోరుకుంది. వారినీ పిలిపించి వ్రతం చేయిస్తుంది. వ్రతాలకి వర్ణభేదం లేదని, సామూహికంగా చేస్తే మరింత ఎక్కువ ఫలితం ఉంటుందనే సామాజిక స్పృహ కలిగిన మహిళామణి చారుమతి.

ఈ లక్షణాలు కొన్నయినా అలవరుచుకుంటే వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. మంగళవారం వ్రతంలో సుశీల, శుక్రవారం వ్రతంలో చారుమతుల ప్రవర్తన అలవాటు చేయటానికే పూజ అయ్యాక వాయనం ఇచ్చేటప్పుడు ‘ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం’ అంటూ. ‘నా వాయనం పుచ్చుకున్న వారెవరు?’ అని అడిగితే ‘నేనే మంగళ గౌరీదేవిని’, ‘నేనే సాక్షాత్తు శుక్రవార వరలక్ష్మీ దేవిని’ అని సమాధానం చెప్పిస్తారు. ఇలా చేయడం వల్ల సాటి వ్యక్తిని ఆరాధ్యదైవంగా చూడటం అభ్యాసమవుతుంది. చారుమతి కథ ద్వారా... చెడుబుద్ధి, దుష్ట సంకల్పం, దుర్గుణాలు లేని పునీత మనస్కులు.. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారనేది సందేశం.

ఇదీ చదవండి: varalakshmi vratham: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే..?

ABOUT THE AUTHOR

...view details