ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Dalitabandhu: దళితబంధు వేగవంతం... పథకంలో సడలింపులు

By

Published : Mar 3, 2022, 7:46 AM IST

Dalitabandhu guideline
దళితబంధు పథకం

Dalitabandhu: తెలంగాణలో తీసుకొచ్చిన దళితబంధు పథకంలో అనేక సడలింపులు ఇవ్వడమే కాకుండా అమలును ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేవలం ఒకరు పది లక్షల రూపాయలతో ఒక్కో యూనిట్‌ గ్రౌండ్ చేసే పరిస్థితి లేకపోతే భాగస్వామ్యంతో చేపట్టే విధంగా మరో అవకాశం కల్పించింది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో అందరికి అమలు చేస్తున్న ప్రభుత్వం... మిగతా నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున ఎంపిక చేస్తోంది.

TS Dalitabandhu: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలును ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కరీంనగర్‌ జిల్లాలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వడం కాకుండా.. వారు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కుటుంబ యజమాని చేస్తున్న పని ఏంటి? అందులో రాణించాలంటే ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుందా? అనే అంశాలను ఆరా తీశారు. కరీంనగర్‌ జిల్లాకు పాడిగేదెల పెంపకం అనుకూలమైందని అధికారులు వివరించారు. మెడికల్ షాపులు, ఎరువుల దుకాణాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్‌ అవకాశం ఉందని అధికారులు సూచించారు. చాలా వరకు కార్లు, మినీ ట్రాన్స్‌పోర్టుకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పాడి పరిశ్రమ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో అధికారులు లబ్ధిదారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని యూనిట్ల గ్రౌండింగ్‌కు శ్రీకారం చుట్టారు. కూలీలు, డ్రైవర్లుగా పని చేసినవారు వాహనాలకు యజమానులుగా మారామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు...

ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేయాలని తొలుత భావించినా... ఆ తర్వాత పథకంలో పలు మార్పులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా 146 మంది లబ్ధిదారులకు 63 యూనిట్లుగా... 51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 6 డీసీఎం వ్యాన్లు, ఒక ట్రాక్టర్, ఒక వరి నాటు యంత్రాన్ని పంపిణీ చేశారు. ఒక్కో హార్వెస్టర్ రూ. 22 లక్షలు, జేసీబీ రూ. 34 లక్షలు, డీసీఎం వ్యాన్ రూ. 24 లక్షలు కాగా... మొత్తంగా రూ. 15 కోట్ల 30 లక్షల 84 వేల విలువైన వాహనాలు లబ్ధిదారులకు అందజేశారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసీబీలు, డీసీఎం వ్యాన్లు ఎంపిక చేసుకోవాలని సూచించడంతో లబ్ధిదారులు ముందుకువచ్చారు.

ఆర్థికంగా ఎదగాలని...

లబ్ధిదారులు ఆర్థికాభివృద్ది సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లు ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితబంధు పథకం నిరంతర ప్రక్రియన్న కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌... ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని నాలుగు మండలాల్లో పథకం అమలవుతోందని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 146 మంది లబ్దిదారులకు రూ. 15 కోట్ల 30లక్షలతో 63 యూనిట్లను మంజూరు చేసిన అధికారులు... మరో 127 యూనిట్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇదీ చూడండి:

TS News: తెలంగాణలో మంత్రి హత్యకు సుపారీ!

ABOUT THE AUTHOR

...view details