ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమ్రాబాద్‌ అడవుల్లో పెద్దపులి.. వీడియోలో బంధించిన అధికారులు

By

Published : Oct 11, 2022, 8:19 PM IST

Tiger in Amrabad forest: విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులకు పెద్దపులి కంటపడటం చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ పులి.. అధికారులకు కనిపించింది. ఆ దృశ్యాన్ని జిల్లా అటవీ అధికారి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అయితే పులిని చూడటం అదృష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా.. పులిని చూశాక వాహనం లైట్లు ఎందుకు ఆర్పలేదని మరికొందరు ప్రశ్నించారు.

tiger
tiger

Tiger in Amrabad forest: పెద్దపులి కంటపడటం మామూలు విషయం కాదు. ఒకవేళ కంటపడినా.. అది వెంటనే పరుగెత్తి వెళ్లడం సహజం. కానీ.. అర్ధరాత్రి వేళ వాహనం లైట్లు పడుతున్నప్పటికీ నిమిషానికి పైగా దర్జాగా నడుచుకుంటూ పులి వెళ్లిన వైనం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అమ్రాబాద్ అటవీ ప్రాంతం ఇందుకు వేదికైంది. జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి ఈ దృశ్యాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రోజువారీ విధి నిర్వహణలో భాగంగా నైట్ పెట్రోలింగ్ డ్యూటీకి వెళ్లిన తనను.. ఓ పెద్దపులి పలకరించిందని ఆయన ట్వీట్ చేశారు. జంగల్స్ ఆఫ్ తెలంగాణ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను ప్రస్తావించారు. నిమిషం పది సెకన్ల వీడియోను ఆయన జతపరిచారు. అందులో ఓ పెద్దపులి దర్జాగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి.

tiger

ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ చేసిన ఈ ట్వీట్‌పై పలువులు స్పందించారు. దీంతో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. తాను అక్కడ పని చేశానని,.. తనకెప్పుడూ పులి కనిపించలేదని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి మోహన్ పర్గేయిన్ పేర్కొన్నారు. రోహిత్​ది అదృష్టమని వ్యాఖ్యానించారు. పులి కనిపిస్తే లైట్ల వెలుతురు తగ్గించడం లేదా ఆర్పివేయాలని, ఎందుకు చేయలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. పులిని చూసిన వెంటనే తాము ఆశ్చర్యానికి లోనయ్యామని.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులి మొదటిసారి తమ కంట పడిందని రోహిత్ సమాధానం ఇచ్చారు. భవిష్యత్‌లో ఇలా జరగదని అన్నారు. పలువురు ఇతరులు కూడా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులి కనిపించిన దృశ్యాలపై స్పందించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటవీప్రాంతంలో సఫారీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అమ్రాబాద్‌ అడవుల్లో పెద్దపులి

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details