ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GO 317 dharna: తెలంగాణలో.. ప్రగతిభవన్​ వద్ద హై అలర్ట్​..!

By

Published : Jan 17, 2022, 7:49 PM IST

GO 317 dharna: 317 జీవో సవరణ సహా ఇతర డిమాండ్లతో తెలంగాణ ఉపాధ్యాయులు ఆందోళనకు పిలుపునిచ్చారు. బీఆర్కే భవన్​ వద్ద నిరసన తెలిపారు. ప్రగతిభవన్​ ముట్టడికి అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్​ అయ్యారు.

GO 317 dharna
GO 317 dharna

GO 317 dharna: జీవో 317 సవరణ సహా.. తొలుత ఎంపిక చేసుకున్న మల్టీ జోన్​కు బదిలీలు చేయాలంటూ తెలంగాణ ప్రధానోపాధ్యాయులు ఆందోళన ఉద్ధృతం చేశారు. న్యాయం చేయాలని ఇవాళ ఉదయం బీఆర్కే భవన్​ (సచివాలయం) ఎదుట ఆందోళన చేశారు. జీఏడీ నిబంధనల మేరకే బదిలీలు చేశామని అధికారులు చెప్పినట్లు ప్రధానోపాధ్యాయులు చెప్పారు. వెంటనే 317 జీవోను సవరించాలని డిమాండ్​ చేశారు. దూరప్రాంతాలకు వెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జోన్లకు బదిలీ అయిన 40 మంది హెచ్​ఎంలు సంగారెడ్డి జిల్లాకు చెందినవారే ఉన్నారని వివరించారు. ప్రధానోపాధ్యాయుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురిని అరెస్ట్​ చేసి నారాయణగూడ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. అన్యాయంగా అరెస్ట్​ చేశారని పలువులు ఉపాధ్యాయులు వాపోయారు.

ప్రగతిభవన్​ వద్ద హై అలెర్ట్​.. ప్రతి వాహనం తనిఖీ

ప్రగతిభవన్​ వద్ద భారీగా పోలీసులు..
ప్రగతిభవన్‌ ముట్టడికీ ఉపాధ్యాయ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్​ అయ్యారు. భారీగా మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాల సంఘాల నేతలపై నిఘా పెట్టారు. ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు నగరానికి వచ్చే అవకాశం ఉండటంతో... ఆయా జిల్లాల పోలీసులకు సమన్వయం చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. 317 జీవోను సవరించాలని.. జీవిత భాగస్వామి బదిలీలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సీనియార్టీ జాబితాలోని తప్పులను సవరించాలని, జోన్, మల్టీ జోన్​లోని తప్పులనూ సరిచేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

సబితా ఇంటివద్ద ధర్నా..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జీవో 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. బదిలీల కారణంగా జీవో 317తో తీవ్రఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

'జీవో 317లో మాకు కొన్ని అభ్యంతరాలున్నాయి.. వాటిని సరిచేయాలి. చివరగా సీనియార్టీ, ఆప్షన్స్​కు అనుగుణంగా బదిలీ చేయాలి. మల్టీ జోన్​ ఆప్షన్లు మళ్లీ తీసుకొంటే.. సమస్య ఒక్కరోజులో పరిష్కారం అవుతుంది.' - ప్రధానోపాధ్యాయురాలు

'మేం ఆప్షన్లు ఇచ్చిన ప్రకారం మల్టీజోన్​ 2కు అలాట్​ చేశారు. అప్పడు ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డిలో ఖాళీలు చూపించారు. మూడు రోజుల తర్వాత మల్టీజోన్​ పోస్టులు కాబట్టి ఆ విధంగా ఆప్షన్లు​ ఇవ్వండి అన్నారు. దాంతో ఎక్కడకు వెళ్లాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. - ప్రధానోపాధ్యాయురాలు

పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళన..
తమను అన్యాయంగా అరెస్ట్ చేయడంపై... గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాంపల్లి పోలీసు స్టేషన్​లో ఆందోళన కొనసాగించారు. అందరిలా తమను బదిలీ చేయాలని సచివాలయానికి వెళ్తే తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు చెప్పి ప్రయోజకులను చేసే తమను... పోలీసు స్టేషన్​లో నిలబెట్టారని వాపోయారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పి దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నా తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా... సీనియారిటీ ప్రకారం బదిలీ చేయాలని కోరారు. సీనియార్టీ ఉన్నా కూడా మల్టీ జోన్ కు దూర ప్రాంతాలకు కేటాయించడం అన్యాయమన్నారు. తమ కుటుంబాల మానసిక వేదనను అర్థం చేసుకొని సంబంధిత ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు.

'సంగారెడ్డి నుంచి 40 మంది ప్రధానోపాధ్యాయులను 370 జీవోకు విరుద్ధంగా మల్టీ జోన్​ 1 కేటాయించారు. ఈ విషయంలో సీనియార్టీ పాటించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి హరీశ్​రావు మమ్మల్ని సచివాలయానికి ఆహ్వానించారు. కానీ పోలీసులు అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. 317 జీవో ప్రకారమే బదిలీలు చేపట్టండి.' - ప్రధానోపాధ్యాయుడు

'సీనియార్టీ ప్రకారం కాకుండా మల్జీ జోన్​ - 1 కు బదిలీ అయ్యాము. మా ఆప్సన్​కు విరుద్ధంగా మల్జీ జోన్​ 1 కు బదిలీ చేశారు. ఈ సమస్యను విన్నవించుకునేందుకు సచివాలయానికి వస్తే పోలీసులు బలవంతంగా వ్యాన్​ ఎక్కించి పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు. ప్రశ్నించడమే నేరమా? సీనియార్టీ లిస్ట్​లో ఉన్న తప్పులను సవరించండి.' -ప్రధానోపాధ్యాయురాలు

ఇదీచూడండి:విద్యాసంస్థలు తెరిచాం.. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు: సురేశ్‌

ABOUT THE AUTHOR

...view details