ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MPP ELECTIONS: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికలు

By

Published : Sep 24, 2021, 7:03 AM IST

statewide-mpp-and-vice-mpp-elections-today

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఎంపీపీ(MPP ELECTIONS), వైస్ ఎంపీపీ(VICE MPP ELECTIONS)లతో పాటు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు కో ఆప్షన్, 3 గంటల నుంచి ఎంపీపీ, ఉపాధ్యక్షుల ఎన్నికలను నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో... మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించనుంది. ఇప్పటికే ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలైనందున... తదుపరి ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్​ఈసీ నేడు ప్రక్రియ పూర్తి చేయనుంది. ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉండగా... మధ్యాహ్నం 12 గంటలవరకూ నామపత్రాలు పరిశీలిస్తారు. 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఒంటిగంటలోపు ఉపసంహరణకు అవకాశం ఉండగా... అదే సమయంలో ఎన్నికల అధికారి కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనున్నారు.

ఎంపీపీల ఎన్నిక విషయంలో కొన్నిచోట్ల ఉత్కంఠ నెలకొంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ ఎన్నికలు మలుపులు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. గతంలో నామినేషన్ల సమయంలో దుగ్గిరాల-1 ఎంపీటీసీ తెలుగుదేశం, ఈమని-1 ఎంపీటీసీ జనసేన అభ్యర్థుల నామినేషన్లు చెల్లవంటూ వైకాపా అభ్యంతరం తెలిపింది. తెలుగుదేశం, జనసేన ఎస్​ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో వారి నామినేషన్లు చెల్లాయి. ప్రచారం మొదలైన కొన్నిరోజులకే దుగ్గిరాల-1, దుగ్గిరాల-3 అభ్యర్థులు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ నెల 19న జరిగిన లెక్కింపులో జనసేన 63 ఓట్లతో గెలిచిన పెదకొండూరులో రీకౌంటింగ్ చేపట్టాలని వైకాపా పట్టుబట్టింది. మరోసారి లెక్కించి 39 ఓట్లతో జనసేన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. వైకాపా మళ్లీ అభ్యంతరం తెలపడంతో 20 ఓట్లతో అధికార పార్టీ గెలిచిందని అధికారులు ప్రకటించారు.

జిల్లాలో అన్ని మండలాల్లోనూ వైకాపాకు ఆధిక్యం ఉన్నందున ఆ పార్టీ నిర్ణయించినవారే ఎంపీపీలుగా ఎన్నికవుతారు. అయితే దుగ్గిరాలలో 18 ఎంపీటీసీ స్థానాలుండగా... 9 స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. వైకాపా 8, జనసేన 1 స్థానం దక్కించుకున్నాయి. ఎంపీపీ సీటు బీసీలకు కేటాయించారు. తెలుగుదేశం తరఫున గెలిచినవారిలో... చిలువూరు-1 నుంచి గెలిచిన షేక్ జబీన్ మాత్రమే బీసీ ఉన్నారు. ఆమెకు పదవి ఖాయం అనుకుంటుండగా మరో మలుపు తిరిగింది. ఆమె కులధ్రువీకరణ పత్రం కోసం సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా... ఎమ్మార్వో ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. అంతలోనే గురువారం ఆమె దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా దుగ్గిరాలలో ఎంపీపీ ఎన్నిక జరుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడితోనే షేక్ జబీన్‌కు అధికారులు కులధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలు గ్రామానికి చెందిన వైకాపా ఎంపీటీసీ పెద్దమ్మి దావీదు అలియాస్ చెన్నయ్య... పదవికి రాజీనామా చేశారు. నంద్యాల ఎంపీపీ పదవి తనకు ఇవ్వట్లేదంటూ... ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా చేసిన సర్వేలో తనపై సదభిప్రాయం లేదని చెబుతున్నారని వెల్లడించారు. ఇక ఫలితాలు ఏకపక్షం.. ప్రజలు వైకాపా పక్షమని.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో ఇటీవల విజయం సాధించిన జడ్పీటీసీ, ఎంపీటీలను అభినందించారు.

ఇదీ చూడండి:AP DEBTS: దారి తప్పిన అప్పు..పడకేసిన ప్రాజెక్టులు

ABOUT THE AUTHOR

...view details