ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌ పెట్టండి!

By

Published : Mar 27, 2021, 8:16 PM IST

ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో అరుగుదల సమస్యలు కాస్త అధికంగా ఎదురవుతాయి. ఎండ వేడిమికి తోడు బయట దొరికే కలుషితమైన ఆహారం, కార్బొనేటెడ్ కూల్‌ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యేకించి నిత్యం హడావుడిలో తిరిగే నగరవాసులకు కడుపునొప్పి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపుబ్బరం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అప్పటికప్పుడు ఏవో మెడిసిన్స్ తీసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే వీటి బదులు వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో జీర్ణ సమస్యలని దూరం చేసుకోవడం మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

#digestion tips, health problems #digestion latest news
జీర్ణ సంబంధ సమస్యలకు చెక్‌

సోంపు గింజలు, జీలకర్ర, యాలకులు, వాము, ఇంగువ, అల్లం, పుదీనా... ఇవన్నీ మన వంట గదిలో ఉండేవే. తాలింపు వేయడానికి, వంటకాలకు రుచి, సువాసన అందించడానికి అందరూ కచ్చితంగా వీటిని ఉపయోగిస్తారు. ఇలా వంటింట్లో దొరికే ఈ దినుసులతో జీర్ణ సంబంధిత సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిని నేరుగా తీసుకోవడం లేదా టీ చేసుకుని తాగడం ద్వారా కానీ ఈ ప్రయోజనాలు చేకూరతాయని వారు చెబుతున్నారు.


సోంపు గింజలు


సాధారణంగా భోజనం తర్వాత చాలామంది సోంపు గింజలను తీసుకుంటుంటారు. ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవ్వడమే ఇందుకు కారణం. మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా ఉపయోగపడే ఈ గింజల్లో శరీరం నుంచి విషవాయువులను పోగొట్టే లక్షణాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, కడుపుబ్బరం, తేన్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపు గింజలను నేరుగా తీసుకోవచ్చు. లేకపోతే వేడి నీళ్లలో బాగా మరగబెట్టి టీగా చేసుకుని తాగొచ్చు.


యాలకులు


ఎలాంటి వంటకాన్నయినా ఘుమఘుమలాడించే యాలకుల్లో విటమిన్లు-ఎ, బి, సి, నియాసిన్‌, రైబోఫ్లేవిన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో తోడ్పడతాయి. తద్వారా ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్‌, గుండెలో మంట, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ఫలితంగా శరరీంలో మెటబాలిజం రేటు మెరుగుపడడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జీలకర్ర


తాలింపులో అధికంగా ఉపయోగించే జీలకర్ర జీర్ణ సంబంధ సమస్యలకు చక్కటి పరిష్కారం. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ప్రత్యేకించి గర్భిణులు దీన్ని తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా అరిగి మలబద్ధకం సమస్య దరిచేరకుండా ఉంటుంది. గర్భిణుల్లో సాధారణంగా కనిపించే వికారాన్ని కూడా ఇది నిరోధిస్తుంది.

వాము


యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న వాము గ్యాస్ట్రిక్‌ సమస్యలను, అజీర్తిని ఆమడ దూరంలో ఉంచుతుంది. వాముతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ పని తీరు మెరుగవుతుంది. వాములో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని జలుబు, జ్వరం, వాంతులు, ఒంటి నొప్పులు... తదితర అనారోగ్యాలకు మందుగా వాడతారు.


ఇంగువ


వివిధ వంటకాలలో ఉపయోగించే ఇంగువలో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అందుకే వీలైన వంటకాల్లో చిటికెడు ఇంగువ వేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఉదయాన్నే పరగడుపున పావుస్పూను ఇంగువని గ్లాసు నీటిలో కలుపుకొని తాగితే మలబద్ధకం సమస్య నయమవుతుంది. ఇక ఇంగువను పేస్ట్‌లాగా తయారుచేసుకుని పసి పిల్లల బొడ్డు చుట్టూ రాస్తే వారిలో కడుపుబ్బరం లాంటి సమస్యలు దూరమవుతాయి.


ఇవి కూడా..

  • శరీరంలోని విషవాయువులను పోగొట్టే ఔషధ గుణాలు అల్లంలో అధికంగా ఉంటాయి. అందుకే ఇది కడుపుబ్బరం, తేన్పులను తక్షణమే నివారిస్తుంది. అల్లాన్ని నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు అల్లం టీ చేసుకున్నా మంచి ఫలితముంటుంది.
  • పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ప్రత్యేకించి కడుపుబ్బరం సమస్యలను దూరం చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది.
  • ఇక జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో పుదీనా సైతం సమర్థంగా పనిచేస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరంతో బాధపడేవారు ఈ ఆకులను తీసుకుంటే తక్షణ ఉపశమనం దొరుకుతుంది. ఈ ఆకులను నమలడం వల్ల జీర్ణాశయంలో పైత్యరసం అధికంగా ఉత్పత్తి అయి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.


వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసుకున్నారుగా!! మరి మీరూ వీటిని ట్రై చేయండి.

ఇదీ చదవండి:

ఆ ఇల్లు అందమైన చిత్రాలు నిండిన పొదరిల్లు

ABOUT THE AUTHOR

...view details