ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మొక్కజొన్న 'రైతుల గోడు'.. కష్టానికి కన్నీరే ప్రతిఫలం

By

Published : Oct 11, 2022, 7:46 AM IST

Updated : Oct 11, 2022, 8:41 AM IST

వడ్డీకి తెచ్చిన అప్పులతో పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం శ్రమించి పంట పండించారు. దిగుబడి బాగుంది, నాలుగు రూపాయలు చేతికొస్తాయని సంబరపడే లోపే.. వారం రోజులుగా కురుస్తున్న వర్షం శాపంలా మారింది. కోసిన మెుక్కజొన్న పొత్తులు మెులకెత్తడంతో.. విజయనగరం జిల్లా రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మొక్కజొన్న పంట నష్టం
మొక్కజొన్న పంట నష్టం

మొక్కజొన్న 'రైతుల గోడు'.. కష్టానికి కన్నీరే ప్రతిఫలం

విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి, పూసపాటిరేగ, గజపతినగరం సహా పలు మండలాల్లో.. ఈ ఖరీఫ్ సీజన్‌లో 18వేల 781 హెక్టార్ల మెుక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఆరంభం నుంచి వర్షాలు అనుకూలించడం, తెగుళ్ల ప్రభావం లేకపోవడంతో దిగుబడి బాగుంది. పంట కోతకొచ్చిన సమయానికి ఎడతెరిపి లేని వానలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం మంది రైతులు కోతలు పూర్తి చేయగా, వర్షాలకు మెుక్కజొన్న కంకులు మొలకెత్తడంతో పెట్టిన పెట్టుబడులు నీళ్లపాలయ్యాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
గతేడాది ఎకరాకు 16 క్వింటాళ్ల దిగుబడి రాగా, రైతులకు ఎకరానికి 18 నుంచి 20వేల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పంట మెుత్తం తడవడంతో.. పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొలంలో పంట దెబ్బతిన్నప్పుడే పరిహారం వస్తుందని, కోసిన మొక్కజొన్నకు పైసా కూడా రాదని అధికారులు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు.

ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సబ్సిడీలు, సహకారం లభించకపోయినా.. రెక్కల కష్టాన్ని నమ్ముకుని ప్రకృతి చేతిలో నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాలకులే న్యాయం చేయాలని కోరుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి, పరిహారం అందేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.
పంట నష్టం వివరాలు సేకరిస్తున్నామని, నిబంధనలకు అనుగుణంగా సాయం అందేలా చూస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 11, 2022, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details