ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Asani Effect: 'అసని' తుపాను బీభత్సం...విశాఖకు విమాన రాకపోకలు రద్దు

By

Published : May 10, 2022, 9:31 AM IST

Updated : May 10, 2022, 2:33 PM IST

RAINS IN AP
రాష్ట్రంలో గాలివాన బీభత్సం ()

RAINS IN AP: రాష్ట్రంలో అసని తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో గాలివానలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్షాలు, ఈదురుగాలులో పంటలు, ఇళ్లు ధంసమవుతుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కర్నూలులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిత్తూరు జిల్లాలోనూ పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. మరోవైపు వాతావరణం అనుకూలించని కారణంగా విశాఖకు విమాన రాకపోకలు రద్దు చేశారు.

రాష్ట్రంలో గాలివాన బీభత్సం

RAINS IN AP: అసని తుపాను ప్రభావంతో.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతంలో చెట్లు విరిగిపడ్డాయి. ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో... పెద్ద వృక్షం పడిపోవడంతో.. ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఉరవకొండ బైపాస్‌లో ఉన్న ఓ రెస్టారెంట్ పైకప్పు ఎగిరిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో... ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. భారీ వర్షం కారణంగా... టవర్ క్లాక్ ప్రాంతంలో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించడంతో... అక్కడినుంచి పరుగులు తీశారు. భారీ వర్షం కారణంగా.... అనంతపురం నుంచి ఉరవకొండకు వచ్చే వాహనాలు.. ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బుక్కరాయసముద్రం మండలంలో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. తాడిపత్రి-అనంతపురం రహదారిపై పెద్ద చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని అనేక ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు దెబ్బతిన్నాయి.

గుంతకల్లులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల వాలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. అనంతపురంలో పడిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లిలో గాలివానకు పాత ఇంటి గోడ కూలడంతో 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులు, వడగండ్ల వర్షంతో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి గాలి వాన బీభత్సానికి పలుచోట్ల విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. విపరీతమైన గాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. శాంతిపురంతో పాటు పరిసర గ్రామాల్లో ఈదురుగాలులకు ఇళ్లపై రేకులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల మామిడికాయలు నేలరాలగా.. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. కడపల్లి వద్ద విద్యుత్ స్తంభాలు జాతీయ రహదారిపై కూలాయి.

కర్నూలు జిల్లాఆలూరు నియోజకవర్గంలో భారీ వర్షానికి వాగులు పొంగిపొరుతున్నాయి. హాలహర్వి మండలంలోఈదురు గాలులకు భారీ చెట్లు నేలవాలాయి. తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో అనేక ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలువల్లో పూడికలు తగ్గించడంతో.. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమదాలవలస మున్సిపాలిటీ 20 వార్డు వెంగలరావు కాలనీలో.. కాలువలో నీరు ఇళ్లల్లోకి చేరుతుండటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. నరసన్నపేట నియోజకవర్గంలో కారు మబ్బులు కమ్ముకోవడంతో... వేరుశనగ, మొక్కజొన్న, వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తిరుపతి జిల్లాలో అసని తీవ్ర తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలోనూ ఉదయం నుంచి వర్షం కురుస్తునే ఉంది. అమలాపురం సహా కోనసీమ వ్యాప్తంగా జోరుగా వర్షం పడుతోంది. వరి చేలు నేలను తాకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాతణుకులో ఈదురుగాలుల ధాటికి ఆచార్య ఎన్జీ రంగా రోడ్డులో చెట్లు నేలకూలాయి. ఈదురుగాలులకు 150 ఏళ్ల నాటి రావి, వేప చెట్లు కుప్పకూలాయి. వినాయకగుడి, ఇల్లు ధ్వంసమయ్యాయి.

అన్నమయ్య జిల్లాలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షం దెబ్బకు... ఉద్యాన పంటలకు భారీగా నష్టం జరిగింది. సుమారు రెండు గంటలపాటు వీచిన గాలుల తీవ్రతకు... చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలో విస్తారంగా ఉన్న మామిడి తోటలపై గాలులు తీవ్ర ప్రభావం చూపాయి. కోత దశలో ఉన్న సమయంలో... తుపాన్ వల్ల మామిడి కాయలు నేల రాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి, నిమ్మ వంటి తోటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని రైతన్నలు వాపోతున్నారు. రాయచోటి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, తదితర మండలాల్లో.. అత్యధిక నష్టం జరిగింది. పంట నష్టం జరిగిన గ్రామాల్లో.. ఉద్యాన శాఖ అధికారులు పర్యటించి.... నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల్లో నాలుగు సార్లు ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు: తుపాను కారణంగా మంగళ, బుధవారాల్లో తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చు. గాలులు గంటకు 40 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.

విమానాలు రద్దు:తుపాను కారణంగా ముందు జాగ్రత్త చర్యగా విశాఖ నుంచి నడుస్తున్న 23 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్ ఏషియా దిల్లీ-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలను కూడా రద్దయ్యాయి. ముంబయి-రాయిపూర్-విశాఖ, దిల్లీ-విశాఖ ఎయిరిండియా విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :May 10, 2022, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details