ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజాసింగ్​కు పోలీసుల నోటీసులు, పాతవి తవ్వుతున్నారన్న ఎమ్మెల్యే

By

Published : Aug 25, 2022, 3:04 PM IST

Police Notices to MLA Raja Singh వివాదాస్పద వ్యాఖ్యలపై అరెస్టై బెయిల్​పై విడుదలైన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్​కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాత కేసులన్నీ తవ్వి ఇప్పుడు అరెస్ట్​ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

raja
raja

Police Notices to MLA Raja Singh: తెలంగాణలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్‌పీసీ కింద షాహినాయత్‌గంజ్, మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్​కు నోటీసులిచ్చారు. అయితే ఈ నోటీసులపై రాజాసింగ్​ స్పందించారు. కక్షపూరితంగా పాత కేసుల్లో నోటీసులు జారీ చేశారని రాజాసింగ్ ఆరోపించారు. నిన్న నోటీసులు సిద్ధం చేసి ఈరోజు తనకు అందించారని ఆక్షేపించారు. పాత కేసుల్లో అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న రాజాసింగ్​.. కేసులు నమోదైన ఆర్నెళ్ల నుంచి పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సదరు వీడియో వైరల్​ కావటంతో.. రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్​ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గపు యువత.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం రాజాసింగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు రాజాసింగ్ ఇంటి పరిసరాలతో పాటు పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఓల్డ్‌ సిటీని తమ అధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. మీర్​చౌక్, చార్మినార్, గోషామహల్ పరిధిలో మొత్తం 360 మంది ఆర్పీఎఫ్​ బలగాలు విధుల్లో ఉన్నాయి. ప్రధాన ప్రాంతాలైన చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్​నుమా, శాలిబండతో పాటు మోగల్​పురా, తలాబ్ కట్టా, రీన్​బజార్ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు రాత్రి 8 గంటలలోపే మూసివేయించారు. రోడ్లపై అకారణంగా తిరుగుతున్న వాహనదారులు, పాదచారులను ఇళ్లకు పంపించారు. వీధివీధి గస్తీ వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహించారు. అదనపు సీపీ స్థాయి అధికారి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details