ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిషత్ పోరు: 7,774 స్థానాల్లో పరిషత్‌ ఎన్నికలు..

By

Published : Apr 6, 2021, 8:13 AM IST

రాష్ట్రంలో 516 జడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 22,423 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్‌శాఖ సోమవారం అందజేసింది.

ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2021
ఏపీలో పరిషత్ ఎన్నికలు

రాష్ట్రంలో 516 జడ్పీటీసీ, 7,258 ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 22,423 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు మృతి చెందడంతో 116 స్థానాల్లో ఎన్నికలు నిలిపివేశారు. ఈ వివరాలను పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సోమవారం అందజేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, ఇతర అధికారులు కలిశారు. ఎన్ని స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నది, పోటీలో ఉన్న అభ్యర్థులు, అభ్యర్థులు మృతి చెందడంతో ఎన్ని స్థానాల్లో ఎన్నికలు నిలిపివేసిందీ ఎస్‌ఈసీకి వివరించారు. పోలింగ్‌ ఏర్పాట్లను సమీక్షించిన ఎస్‌ఈసీ అధికారులకు పలు సూచనలు చేశారు.

నేటితో ముగియనున్న ప్రచారం
అభ్యర్థుల ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమవుతుంది. పోలింగ్‌ ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌, ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు సోమవారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు వివరించారు. పోలింగ్‌ పూర్తయ్యాక బ్యాలెట్‌ బాక్సులు భద్రపరచడం, శనివారం ఓట్ల లెక్కింపు కోసం చేసిన ఏర్పాట్లపైనా పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
వాహనాలకు అనుమతులిచ్చే అధికారం తహసీల్దార్లకు
ఈ నెల 8న పోలింగ్‌ సందర్భంగా అభ్యర్థులు వినియోగించే వాహనాలకు తహసీల్దార్లు అనుమతులివ్వనున్నారు. ఇప్పటి వరకు సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలకే ఈ అధికారం ఉండేది. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలకు వెళ్లి అనుమతులు తీసుకోవడం కష్టమవుతుందని రాజకీయ పార్టీలు విన్నవించడంతో తహసీల్దార్లకు అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలింగ్‌ రోజున వాహన వినియోగం కోసం కలెక్టర్లు అనుమతులివ్వనున్నారు.

ABOUT THE AUTHOR

...view details