ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్మశాన వాటికల నిర్మాణాలకు... బిల్లుల అడ్డంకి!

By

Published : Apr 27, 2021, 9:26 AM IST

చివరి మజిలీకి బిల్లులు అడ్డంకిగా మారుతున్నాయి. 36 ఆధునిక శ్మశాన వాటికల నిర్మాణానికి రూ. 49.54 కోట్లు మంజూరు చేసినా.. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఏడాది గడిచినా ఒక్కటి కూడా పూర్తవ్వలేదంటే.. అధికారులు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

burial grounds
అసంపూర్తిగా నిలిచిపోయిన శ్మశాన వాటిక నిర్మాణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. మృతదేహాలను దహనం చేయడానికి సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో విజయవాడ, గుంటూరు వంటి పెద్ద నగరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిరుడు కూడా కరోనా సోకి రాష్ట్రంలో ఏడు వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. పట్టణాల్లో మృతులు ఎక్కువగా ఉండటంతో అప్పట్లోనూ అంత్యక్రియలకు అవస్థలు తప్పలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు 35 పట్టణాలలో 36 విద్యుత్తు/గ్యాస్‌ శ్మశానవాటికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.49.54 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణాల బాధ్యతను పురపాలకశాఖకు అప్పగించి, ఏడాదిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించింది.

మరేం జరిగింది?
ఏడాదైనా ఇప్పటి వరకు ఒక్కటీ అందుబాటులోకి రాలేదు. అప్పట్లో రూ.34.78 కోట్ల సివిల్‌ పనులు పురపాలక సంఘాలకు, రూ.14.76 కోట్లతో ఎల్‌పీజీ గ్యాస్‌ ఎక్విప్‌మెంట్‌ పనులు ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్‌ విభాగానికి అప్పగించారు. టెండర్లు పిలవడం, గుత్తేదారులను ఖరారు చేయడం చకచకా జరిగిపోయాయి. ఒక్కచోట మినహా 35 పట్టణాల్లోనూ 35చోట్ల పనులు ప్రారంభించారు. 20 చోట్ల భవనాల శ్లాబ్‌ పనులు పూర్తయ్యాయి. మరో పది వరకు కాలమ్స్‌ వరకు వేసి నిలిపివేశారు. మిగతావి పునాదుల దశలో నిలిచిపోయాయి. కొన్ని పట్టణాల్లో గ్యాస్‌ పరికరాలను సిద్ధం చేసినా భవనాలు పూర్తి కాలేదు.

కారణం ఏమిటి?
ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నా పూర్తి చేసిన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం(సీఎఫ్‌ఎంఎస్‌) వద్ద నిలిచిపోయాయి. వాటిని ఆమోదించడంలో జాప్యం జరిగింది. ఆర్థిక భారం మోయలేక గుత్తేదారులు పనులు నిలిపేశారు.

అధికారులు ఏమంటున్నారు?
రానున్న నెల రోజుల్లో 20-25 శ్మశాన వాటికలను అందుబాటులోకి తెస్తామని ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, స్థల సమస్య, ఇతర సాంకేతిక కారణాలతోనూ పనుల్లో జాప్యమైనట్లు వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో గంటకు 400 మందికి పైగా కరోనా

ABOUT THE AUTHOR

...view details