ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Sagar:వేల కోట్లు ఆవిరి?.. నాగార్జునసాగర్​ ఎడమకాల్వ నిర్వహణలో బయటపడిన లోపాలు

By

Published : Sep 14, 2022, 12:58 PM IST

Updated : Sep 14, 2022, 1:45 PM IST

Nagarjuna Sagar Left canal: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడిన నేపథ్యంలో ముప్పారం వద్ద ఉన్న నాగార్జున సాగర్​ ఎడమ కాలువకు గండి పడడంతో నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. వేల కోట్లు వెచ్చించి ఆధునీకరణ పనులు జరిగిన ఎందుకు కోతలకు గురవుతుందో ప్రశ్నార్థకంగా మారింది. నిర్వహణ, పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగి ఉండవచ్చునని రైతులు సంఘాలు భావిస్తున్నాయి. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పనులపై ప్రత్యేక కథనం..

Sagar Left canal
నాగార్జున సాగర్​ ఎడమ కాలువ

సాగర్​ ఎడమ కాలువ

Nagarjuna Sagar Left canal: పనుల్లో కొరవడిన నాణ్యత... అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనులకు వెచ్చించిన కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారాయి. ఎడమ కాలువ పెండింగ్ పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యం... ఎన్ఎస్పీ అధికారుల అలసత్వం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వరప్రదాయిని అయిన సాగర్ ఎడమ కాలువ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెరాస ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందని ఆయకట్టు రైతులు వాపోతున్నారు.

నల్గొండ, మిర్యాలగూడ డివిజన్​ పరిధిలో కాలువ లైనింగ్​కు దెబ్బ:నల్గొండ జిల్లా, మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పలు చోట్ల సాగర్ ఎడమ కాలువ లైనింగ్ దెబ్బతిని నీటి ప్రవాహానికి మట్టి కొట్టుకుపోయి కాలువ గట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మిర్యాలగూడ మండల పరిధిలో అన్నపురెడ్డిగూడెం వద్ద కిలోమీటర్ మేర ఎడమ కాలువ కట్ట లైనింగ్ కొట్టుకపోయి బలహీనంగా ఉంది. వేములపల్లి మండలం శెట్టిపాలెం ఎస్ 6 లిఫ్ట్ సమీపంలో కాల్వ లైనింగ్ పనులు జరగకపోవడంతో పగుళ్లు ఏర్పడి రాళ్లు పైకి తేలి నిర్జీవంగా ఉంది. అదేవిదంగా ముల్కల కాల్వ మేజర్ వద్ద, జగ్గు తండా లిఫ్ట్ సమీపంలో ఆధునికీకరణ పనులు జరగకపోవడంతో 60 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన కాలువ కట్ట నీటి ప్రవాహానికి కోతకు గురైంది.

కొరవడిన సిమెంట్​ లైనింగ్​ పనులు:ఇలా ఎడమ కాలువ పరిధిలో నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, నేరేడుచర్ల మండలాల పరిధిలో అనేకచోట్ల సిమెంట్ లైనింగ్ పనులు చేయకపోవడంతో కాలువ కట్ట బలహీనంగా మారింది.ఇలాగే ఉంటే నీటి ప్రవాహం ఒక వైపు, అకాల వర్షాలకు కాలువ కట్ట నాని గండ్లు పడే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల కోట్లు వెచ్చించి ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినప్పటికీ పలు చోట్ల కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేయకపోవడంతో మొన్న జరిగిన ముప్పారం వద్ద కాలువకు గండి పడిన సంఘటనలు పునరావతమయ్యే అవకాశాలు ఉన్నాయని రైతు సంఘాలు వాపోతున్నారు.

అనుకోని సంఘటన జరిగినప్పుడే అధికారులు, ప్రభుత్వంలో చలనం వస్తుందని తరువాత ఎవరి దారి వారిదేనని రైతు సంఘాలు వాపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎడమకాలువ నిర్లక్ష్యానికి గురైందని ఈ ప్రాంత వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరానికి లక్ష కోట్లు వెచ్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో ని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసాడని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రపంచ బ్యాంక్​, ప్రభుత్వాల నిధులు వృథా:ఇది ఇలా ఉండగా... ప్రపంచ బ్యాంకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి రూ.4444 కోట్లతో 2008లో సాగర్ ఎడమ, కుడి కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టారు. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కిలోమీటర్ల నుంచి 133 కిలోమీటర్ల పొడవు వరకు ఎడమ కాలువ ఆధునీకరణకు( ఐదు ప్యాకేజీల్లో)ఓ గుత్తేదారు కంపెనీ రూ.1026 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు ఆరేళ్లలో ఈ పనులు పూర్తి కావాలి. పదేళ్లు గడిచిన కాల్వకు పూర్తిస్థాయిలో లైనింగ్ చేయలేకపోయారు. మొత్తం ఐదు ప్యాకేజీల్లో తొలి, మూడో ప్యాకేజీ లోనే పనులు పూర్తవుగా, మిగిలిన వాటిలో అసంపూర్తిగా పనులు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల కాలువలు శిధిలావస్థకు చేరింది. ప్రధాన గుత్తేదారు కాలువ ఆధునీకరణ పనులను కిలోమీటర్ చొప్పున సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా పనులు చేశారని, అధికారులు వారి అడుగులకు మడుగులోత్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ముప్పారం వద్ద కాలువకు గండి:ఇప్పుడు అధికారుల నిశ్శబ్దతతో ముప్పారం వద్ద ఎడమ కాలువకు గండిపడి వందల ఎకరాల్లో పంట నీట మునిగి రైతులు,ప్రజలు నష్టపోయారు. సాగర్ ఎడమ కాల నిర్మాణం జరిగి 60 ఏళ్లకు పైగా కావడంతో కాల్వకట్ట బలహీనమైంది. ప్రపంచ బ్యాంకు నిధులతో పనులు జరిగిన పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు జరగకపోవడంతో కాల్వకట్ట నీటి ప్రవాహానికి కోతకు గురవుతుంది. ఇదే విధమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సాగర్ ఎడమ కాలువ అనేక చోట్ల గండ్లు పడే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఎడమ కాలువ పర్యవేక్షణలో ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని నీటి విడుదల సమయంలో ఎడమ కాలువ కట్టను పరిశీలించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని....తీరా నష్టం జరిగాక ఇప్పుడు ఎస్టిమేట్లు అంటూ, టెండర్లంటూ ఎన్ఎస్పీ అధికారులు జ్యోస్యం చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని సాగర్ ఎడమ కాలువ పై అసంపూర్తిగా ఉన్న ఆధునికీకరణ పనులను వెంటనే చేపట్టాలని, లేనిపక్షంలో రైతు ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Sep 14, 2022, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details