ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులు కుదించిన ప్రభుత్వం

By

Published : Dec 25, 2020, 11:46 AM IST

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రభుత్వం కుదించింది. ఈమేరకు పనులు పూర్తిచేసేందుకు 10 వేల కోట్ల రుణం తీసుకోవాలని ఏఎంఆర్​డీఏ నిర్ణయించింది. మూడంచెల్లో నిధులు ఇచ్చేందుకు బ్యాంకుల కన్సార్షియం ఆమోదించిందని, తొలి విడతగా 3 వేల కోట్లకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరింది.

ministers-buggana-and-botsa-review-on-amravati-works
అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టులు కుదించిన ప్రభుత్వం

రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టేందుకు వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) భావిస్తోంది. మూడంచెల్లో ఆ నిధులు ఇచ్చేందుకు కన్సార్షియం ఆమోదం తెలిపిందని, తొలి విడతగా ఇచ్చే రూ.3 వేల కోట్లకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఏఎంఆర్‌డీఏ కోరింది. అమరావతిలో వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల్ని రూ.29,281.98 కోట్లతో గత ప్రభుత్వం చేపట్టగా, వాటిని రూ.11,092.88 కోట్లకు కుదించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని ఏఎంఆర్‌డీఏ ప్రాధాన్యక్రమంలో చేపట్టనుంది. రుణాలకోసం ఏఎంఆర్‌డీఏ, బ్యాంకులను సమన్వయపరిచే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు.

మంత్రుల సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలివి..

* అమరావతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద గతంలో ప్రతిపాదించిన 20 పనుల్ని 10కి కుదించారు. అంచనా వ్యయాన్ని రూ.2,046 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు తగ్గించారు. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే సిద్ధంగా ఉన్న రూ.360 కోట్లతో పనులు కొనసాగించాలి.
* స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో కొత్తగా ‘అమరావతి స్మార్ట్‌ సిటీ యాక్సెస్‌’ రోడ్డును చేర్చారు. కరకట్ట మార్గాన్ని రూ.150 కోట్లతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలి. ఈ నిధుల్ని ఏఎంఆర్‌డీఏ సమకూర్చాలి.
* రూ.86 కోట్లతో అమరావతి ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రాజెక్టును నిర్మించాలి. ఇండో జపాన్‌ హ్యూమన్‌ ఫ్యూచర్‌పెవిలియన్‌ ప్రాజెక్టును పూర్తిచేయాలి.
* వెలగపూడిలోని సచివాలయ భవనాల నిర్వహణ బాధ్యతల్ని ఏఎంఆర్‌డీఏ నుంచి సాధారణ పరిపాలన విభాగానికి బదలాయించాలి.
* ఏఎంఆర్‌డీఏ పరిధి, అమరావతిలోని 29 గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణను సంబంధిత ప్రభుత్వ విభాగాలకే అప్పగించాలి.
* హైకోర్టు నిర్వహణ బాధ్యతను న్యాయశాఖకు, కోర్టుకు అప్పగించడంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

నిధులు వస్తే పనులు ప్రారంభిస్తాం: మంత్రి బొత్స

అమరావతిలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలో ఓ నిర్ణయానికి వచ్చామని, బ్యాంకుల నుంచి నిధులు సమకూరిన వెంటనే పనులు ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో ఎప్పటికల్లా పనులు ప్రారంభిస్తారన్న ప్రశ్నకు... 'ప్రధాన మౌలిక వసతుల పనులు, భవనాలను పూర్తిచేస్తాం. కరకట్ట రోడ్డును చేపడతాం. నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రక్రియ కొలిక్కి వస్తే పనులు మొదలవుతాయ'ని తెలిపారు.

ఇదీ చదవండి:

అరుదైన వైద్యం చేశారు...ప్రాణం పోశారు

ABOUT THE AUTHOR

...view details