ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anganwadi : పిల్లలకు పాలేవి.. గర్భిణులకు పోషకాలేవి ?

By

Published : May 21, 2022, 5:16 AM IST

అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా సక్రమంగా జరగడం లేదు. కొన్నిచోట్ల నెల మొత్తంగా పాలు ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సరఫరా కాని కొన్నిచోట్ల పసివాళ్లకు పాలు ఇవ్వకుండానే ఇంటికి పంపిస్తున్నారు. 3-6 ఏళ్ల పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ఇంటికే పాల ప్యాకెట్ల పంపిణీలోనూ జాప్యమేర్పడుతోంది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. పాల సరఫరాపై అదిగోఇదిగో అంటూనే అధికారులు కాలం గడిపేస్తున్నారు. ఉన్న నిల్వలతో సర్దుబాటు చేస్తున్నారు.

Anganwadi
Anganwadi

రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 6.50 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, 23 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. ప్రీస్కూల్‌ పిల్లలకు 100 మి.లీ. చొప్పున రోజూ అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పాలు ఇవ్వాలి. 3-6 ఏళ్ల పిల్లలకు 100 మి.లీ., గర్భిణులు, బాలింతలకు 200 మి.లీ. చొప్పున అందించాలి. ఇందుకుగాను నెలకు కోటి లీటర్ల పాలు కావాలి. కానీ మార్చి కోసం 70లక్షల లీటర్లే సరఫరా అయ్యాయి. ఏప్రిల్‌లో మరింత తగ్గి 60 లక్షల లీటర్లు అందాయి. మేలో ఇప్పటివరకు 50లక్షల లీటర్ల వరకు చేరాయి. నెలనెలా సగటున 30 లక్షల లీటర్ల వరకు తక్కువ వస్తున్నాయి. గుత్తేదారులు నెలలో రెండు విడతలుగా పాలు సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని కేంద్రాలకు ఒక విడతతోనే సరిపెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల నెల మొత్తం అందడం లేదు.

సర్దుబాటుతోనే సరి..రాష్ట్రవ్యాప్తంగా 257 ప్రాజెక్టులకు సంబంధించి 189 స్టాక్‌పాయింట్లు ఉన్నాయి. పాలు ఆ పాయింట్లకు చేరాక అంగన్‌వాడీ కేంద్రాలకు తరలిస్తారు. నెలకు సంబంధించిన మొత్తం ఇండెంట్‌ ప్రతినెలా 25లోపు సరఫరా కావాలి. ఈ పరిస్థితి లేదు. జిల్లాల పరిధిలో కొన్ని కేంద్రాలకు పాలు పూర్తిగా అందితే మరికొన్ని కేంద్రాలకు అసలు చేరడం లేదు. నెల చివరలో చేరిన పాలలో కొన్ని మరుసటి నెల ఖాతాలో చూపుతున్నారు. కోత కనిపించకుండా సర్దుబాటు చేస్తున్నారు. నెల మొత్తం ఎంత మేర పాలు సరఫరా అవుతాయో ఆ మేరకు బిల్లులు చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

* శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మార్చి మూడో వారం నుంచే పిల్లలకు పాలు అందడం లేదు. మే మొదటివారంలో పంపిణీ ప్రారంభమైనా ఇప్పటివరకు 55% మాత్రమే సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా పాలను 2,3 రోజుల్లో అందిస్తామంటున్నారు.

* గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాజెక్టు పరిధిలోని కేంద్రాలకు నెలకు 60వేల లీటర్ల వరకు పాలు అవసరం కాగా, ఇప్పటివరకు 50% మాత్రమే చేరాయి. గుంటూరు ప్రాజెక్టు-1 పరిధిలో నెలకు 25వేల లీటర్ల వరకు పాలు సరఫరా కావాల్సి ఉండగా.. ప్రతి క్లస్టర్‌లోనూ కొంత కొరత ఉంది. పక్కన క్లస్టర్‌లోని మిగిలిన పాలను సర్దుబాటు చేస్తున్నారు.

* విజయనగరం జిల్లా పరిధిలోని కొన్ని కేంద్రాలకు పాలు అందగా, మరికొన్ని ప్రాంతాల్లోని కేంద్రాలకు సరఫరాలో జాప్యమేర్పడుతోంది. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

* తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 114 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3నెలలుగా పాల సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. పిల్లలకు పాలివ్వకుండానే ఇంటికి పంపిస్తున్నారు.

* చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, గంగాధరనెల్లూరు, చిత్తూరు ప్రాజెక్టులోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కొంత మేర పాల కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

* ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 220 కేంద్రాలకుగాను కొన్నింటికి ఈనెల 2న పాలు సరఫరా కాగా, మరి కొన్నింటికి ఇప్పటివరకు మొదటి విడత కూడా అందలేదు.

* అనకాపల్లి జిల్లా కోటవురట్ల సీడీపీవో ప్రాజెక్టు పరిధిలోని 242 అంగన్‌వాడీ కేంద్రాలకు మే నెలకు సంబంధించి ఇప్పటివరకు పాలు సరఫరా కాలేదు. ఇక్కడ ప్రతి నెలా 28వేల లీటర్ల పాలు అవసరం.

* అనంతపురం అర్బన్‌ ఐసీడీఎస్‌ పరిధిలోని 122 అంగన్‌వాడీ కేంద్రాలకుగాను మే నెలకు సంబంధించి 78 కేంద్రాలకు పాలు అందాయి. మిగిలినవాటికి 2రోజుల్లో సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:జూ.ఎన్టీఆర్ అభిమానులు, వైకాపా నేతల మధ్య 'ఫ్లెక్సీ' పంచాయితీ

ABOUT THE AUTHOR

...view details