ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Medaram Hundi Counting : మేడారం జాతర కానుకల లెక్కింపు ప్రారంభం

By

Published : Feb 23, 2022, 10:36 PM IST

Medaram Hundi Counting : మేడారం జాతర ఘనంగా ముగిసింది. వనదేవతలు జనానికి దర్శనమిచ్చి వన ప్రవేశం చేశారు. అమ్మవార్లను దర్శించుకోడానికి వచ్చిన భక్తులు తిరిగి ఇళ్లకు బయలుదేరుతున్నారు. మరోవైపు మేడారం మహా జాతర కానుకల లెక్కింపు ప్రారంభమైంది.

మేడారం జాతర కానుకల లెక్కింపు ప్రారంభం
మేడారం జాతర కానుకల లెక్కింపు ప్రారంభం

మేడారం జాతర కానుకల లెక్కింపు ప్రారంభం

Medaram Hundi Counting : మేడారం జాతర హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల... లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో... కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 497 హుండీలను కట్టుదిట్టమైన భద్రత నడుమ మేడారం నుంచి ప్రత్యేక బస్సుల్లో కల్యాణ మండపానికి తీసుకొచ్చి భద్రపరిచారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజుల పాటు లెక్కింపు జరగనుంది. ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో అధికారులు జమచేయనున్నారు.

రెండేళ్ల క్రితం జాతరలో ఎంత వచ్చిందంటే..

2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్ల 54 లక్షల 71 వేల రూపాయల ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపేణా రూ.11 కోట్ల 65 లక్షలు ఆదాయం చేకూరిందని... వాటితో పాటు కిలో 63 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. గతంలో 502 హుండీలను ఏర్పాటు చేశారు.

ఘనంగా తిరుగువారం పండుగ

మేడారం మహా జాతరలో ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.... తల్లులను దర్శించుకున్నారు. నెల ముందు నుంచి... జాతర వరకూ కోటి ముప్పై లక్షలకుపైగా భక్తులు దర్శించుకున్నారని అంచనా వేశారు. జాతర ముగిసిన తర్వాత ఆదివారం కూడా దాదాపు పదిలక్షలపైగా భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు. ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించారు.

తిరుగువారం అనగా..

జాతర ముగిసిన తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండుగ అంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జాతర విజయవంతంగా జరిగినందుకు.....వనదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ....ఆలయాలను శుద్ధి చేసి, గద్దెల చెంత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు కుంకుమలు సమర్పించి...బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో పూజారులు కుటుంబ సమేతంగా పాల్గొంటారు. దీనితో మహా జాతర వేడుకలు...పూర్తయినట్లే. తిరగువారం పండుగ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ పూజారులు జాతర సమయంలో తలనీలాలు ఇవ్వకుండా తిరుగువారం నాడు పూజారులంతా పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. గిరిజన వాయిద్యాలతో సమ్మక్క సారలమ్మ పూజారులు గుడి వద్దకు వెళ్లి పూజలు చేసి మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. సంప్రదాయ పద్ధతిలో తిరుగు వారం పండుగ ఘనంగా జరుపుకున్నారు.

ఇదీ చూడండి :దేశ అభివృద్ధిలో డీసీఐ కీలకపాత్ర పోషిస్తోంది:కేంద్రమంత్రి సోనోవాల్

ABOUT THE AUTHOR

...view details