ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఉద్దేశాలను ఆపాదించటం రాజ్యాంగ విధులను అడ్డుకోవడమే'

By

Published : Mar 16, 2020, 6:13 AM IST

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విధులను అడ్డుకోవడమేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్ కుమార్ అన్నారు. స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్​ఈసీ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. కమిషన్ ఏ కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ లేఖ విడుదల చేశారు. సీఎం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రమేష్‌కుమార్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉంది

local-elections-postponed
కరోనా ఉద్ధృతితో ఎన్నికలు నిలిపివేత...6వారాల పాటు విరామం

కరోనా ఉద్ధృతితో ఎన్నికలు నిలిపివేత...6వారాల పాటు విరామం

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విధులు అడ్డుకోవడమేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీపరుస్తాయన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థన్న ఎస్​ఈసీ. .. హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అన్ని అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయని తెలిపారు. కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించినందునే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏ కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ రెండు పేజీల పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

చర్చించిన తర్వాతే...

జాతీయ స్థాయి యంత్రాంగంతో చర్చించిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, జోక్యం చేసుకుని ఆదేశాలను నిలుపుదల చేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ వివరణ ఇచ్చారు. కేంద్రం విపత్తు ఆదేశాలు ఉపసంహరించిన తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాలు పంపిణీ... నియమావళికి విరుద్ధం

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉంటుందని.. ఈ సమయంలో వ్యక్తి గత లబ్ది చేకూర్చే ఏ పథకాన్ని అమలు చేయకూడదని రమేశ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాటించిన మార్గదర్శకాలనే తాము పాటిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం నియమావళికి విరుద్ధమని అందుకే పట్టాల పంపిణీకి అనుమతించలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలను నిలుపుదల చేశామని... రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆరు వారాలలోపే కరోనా ప్రభావం తగ్గితే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు

నేడు గవర్నర్​తో ఎస్​ఈసీ భేటీ...

పోలీసులు, అధికారులపై వేటు వేయడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపైనా రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల్లో హింస జరిగిందని పలు రాజకీయ పార్టీలు తమకు ఫిర్యాదు చేశాయని లేఖలో ఎస్​ఈసీ తెలిపారు. ఎన్నికల్లో హింస ఘటనపై హైకోర్టు లోనూ వాజ్యం విచారణలో ఉందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను సైతం ప్రతివాదులుగా చేర్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయని.. ఇదే విషయమై కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చెప్పిన అంశాలనే తాము పాటిస్తున్నట్లు తెలిపారు. నేడు రమేశ్ కుమార్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. సీఎం జగన్ లేవనెత్తిన అభ్యంతరాలపై గవర్నర్‌ చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి-కరోనాను నిరోధాన్ని కాంక్షిస్తూ తిరుమలలో యాగం

ABOUT THE AUTHOR

...view details