ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Water problems in villages: పల్లెల్లో నిండుకున్న నీళ్లు... పంచాయతీల్లో నిధుల కొరత

By

Published : Mar 19, 2022, 4:11 PM IST

Water problems in villages: మండుటెండలతో భూగర్భజలాలు నిండుకుంటున్నాయి. పల్లెల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పరిష్కరించాల్సిన పంచాయతీలు నిస్సహాయంగా చూస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చాల్సిన సర్పంచులు.. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దయ తలిస్తే.. ప్రజల దాహం తీరుస్తామని అంటున్నారు.

Water problems in villages
పల్లెల్లో నీళ్లు

పల్లెల్లో నీళ్లు

Water problems in villages: భానుడి భగభగలకు ప్రజల గొంతెండుతోంది. గ్రామాల్లో తాగునీటికి కటకట ఏర్పడింది. బోర్లలో నీరు అడుగంటాయి. ట్యాంకులకు సరిపడా నీరు రాక.. కుళాయిలకు సరఫరాలో సమస్యలు నెలకొంటున్నాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని బోర్లు, పొలాల్లోని బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధ పడేవారి కష్టాలు చెప్పనలవి కావడం లేదు.

నీటి కష్టాలు తీర్చాలని సర్పంచులను ప్రజలు వేడుకొంటున్నారు. కొన్నిచోట్ల నిలదీస్తున్నారు. సమస్య పరిష్కారానికి సర్పంచులు సుముఖంగా ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. పంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో నిస్సహాయులైపోయారు. స్థోమత ఉన్న కొందరు సర్పంచులు సొంత డబ్బు వెచ్చిస్తున్నా.. అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి.

"పంచాయతీల్లో నిధులు లేక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఏ పని చేద్దామన్నా ఆదాయం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదు. ఏ పనులు చేయక.. ఉత్సవ విగ్రహాల్లాగా ఉండాల్సి వచ్చింది. ఫీల్డ్​లోకి వెళ్తే.. ఓట్లు వేసి గెలిపించినా మాకు ఏమీ చేయడం లేదని, సమస్యలు తీర్చడంలేదని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. మరి మేమేం సమాధానం చెప్పాలో.. జగన్​గారు కూడా ఒక సమాధానం చెప్తే బాగుంటుంది. మా నిధులు మాకిచ్చేస్తే మేము అభివృద్ధి చేసుకోగలుగుతాం."- ఇందిర, సర్పంచ్, ఈడుపుగల్లు, కృష్ణా జిల్లా

Water problems in villages: వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు పల్లెల్లో అదనంగా బోర్లు వేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్నిచోట్ల పైపులైన్లు వేయాల్సి వస్తోంది. వీటన్నింటి కోసం సర్పంచులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఇటీవల పంచాయతీ ఖాతాల్లోని నిధులను.. ఎవరి అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవడంతో పనులు నిలిచిపోయాయని సర్పంచులు చెబుతున్నారు. తాత్కాలిక చర్యలు చేపడదామన్నా పంచాయతీల వద్ద చిల్లిగవ్వ కూడా లేదని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను నిధులు అడిగినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Water problems in villages: గ్రామ పంచాయతీలను, సర్పంచుల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఆక్షేపించారు. రాష్ట్రం నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇచ్చిన డబ్బులనూ లాగేసుకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిధుల్ని తిరిగివ్వకపోతే.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తాగునీటి సమస్య దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్న డిమాండ్‌ ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది.

ఇదీ చదవండి:'చెత్త పన్ను చెల్లించకపోతే చెత్తవేసి... ఆస్తిపన్నుపై చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details