ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Water issues: రాష్ట్రానికి నష్ట భయం తొలగేనా?

By

Published : Oct 14, 2021, 7:04 AM IST

krmb

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న 17 అవుట్‌లెట్లు (నీరు బయటకు వదిలే మార్గాలు) బోర్డుల పరిధిలోకి తీసుకోవాలన్న తీర్మానంతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టభయం తొలగేనా? అన్న చర్చ జరుగుతోంది. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చేలా గట్టి ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు ముసురుకుంటున్నాయి. మరోవైపు గోదావరిలో పెద్దవాగు ప్రాజెక్టునే బోర్డుల పరిధిలోకి ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. గోదావరి డెల్టా రెండోపంటకు నీటిభరోసా లేకపోవడంతో ఎగువ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వస్తేనే ఉపయోగమని చెబుతున్నారు.

శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టును బోర్డుల పరిధిలోకి తీసుకురాకపోతే ఎలా అని అంతర్రాష్ట్ర జలవనరుల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణాజలాలు నారాయణపూర్‌ జలాశయం దాటి ప్రవేశించేదే జూరాలలోకని... ఎంత నీరు వచ్చిందో లెక్కలు ఖరారు చేయాలన్నా జూరాలను బోర్డు పరిధిలోకి తేవాలని అనేక ఏళ్లపాటు కృష్ణా అంతర్రాష్ట్ర వివాదాల్లో పనిచేసిన విశ్రాంత ఇంజినీరింగు నిపుణులు గంగాధర్‌ సూచించారు.

*దాదాపు 500 టీఎంసీల నికరజలాలు జూరాలను దాటి రావాలని, అక్కడ ఎంత నీరు మళ్లిస్తున్నారనేది కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అంశమవుతుందని అంతర్రాష్ట్ర జల విభాగంలో సీఈగా పనిచేసిన విశ్రాంత అధికారి రామకృష్ణ పేర్కొన్నారు.

*జూరాల కింద 59 టీఎంసీల వరకు వినియోగిస్తున్నారని- జూరాల దిగువన పదకొండో షెడ్యూలు ప్రాజెక్టు నెట్టెంపాడు ఉందని మరో విశ్రాంత నిపుణులు తెలిపారు. వరదజలాల వినియోగంలో భాగంగా ఉన్న నెట్టెంపాడు కింద వినియోగం ఇలా చేయడం వల్ల లెక్కల్లోకి రాదని గంగాధర్‌ అభిప్రాయపడ్డారు. ఆ మూడు ప్రాజెక్టుల కింద కొంత ఆయకట్టు రెండేసి ప్రాజెక్టుల కింద గతంలో చూపారని విశ్రాంత సీఈ చెప్పారు. అక్కడి నుంచి చెరువులకు నీటిని కూడా ఎత్తిపోసుకుంటున్నారని- ఈ పరిస్థితుల్లో జూరాలను విస్మరిస్తే బోర్డుల పరిధికి సమగ్రత రాదని అభిప్రాయపడుతున్నారు. గతంలో ముసాయిదా నోటిఫికేషన్‌లో జూరాల చేర్చామని గుర్తు చేసుకున్నారు.

గోదా‘వరి’ కష్టాల్లో ఇలా అయితే ఎలా..

*వర్షాలు లేనప్పుడు గోదావరి డెల్టాలో సాగు, తాగునీటి అవసరాలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం బోర్డు పరిధిలోకి పెద్దవాగు ఉమ్మడి ప్రాజెక్టు ఒక్కటే తీసుకొచ్చారు. ఎగువన గోదావరిలో అనేకచోట్ల నుంచి నీటిని మళ్లిస్తున్నారు. కిందటి నీటి సంవత్సరంలోనూ గోదావరి డెల్టాలో సాగుకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. సీలేరు విద్యుత్తు కేంద్రం నుంచి నీటిని తీసుకుని సాగు, తాగు అవసరాలకు వాడుకోవాల్సి వచ్చింది. కరవు సమయంలోనూ ఎగువ రాష్ట్రం గోదావరిలో నీటిని ఎత్తిపోతలతో మళ్లిస్తోందని ఏపీ అధికారులు చెబుతూ శ్రీరాంసాగర్‌ నుంచి దిగువ వరకూ ఉన్న ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఆ ప్రయత్నం ఫలించలేదు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details