ఆంధ్రప్రదేశ్

andhra pradesh

sand arrears: సర్కార్​ను వీడని ఇసుక కష్టాలు.. రూ.150 కోట్లు బాకీ పడ్డ జేపీ సంస్థ!

By

Published : Oct 25, 2021, 10:09 AM IST

Updated : Oct 25, 2021, 11:46 AM IST

రాష్ట్రంలో ఇసుక బాధ్యతలు చేపట్టి ఐదు నెలలవుతున్నప్పటికీ.. జేపీ సంస్థ నుంచి బకాయిలను ఏపీఎండీసీ(APMDC) రాబట్టుకోలేకపోతోంది. మరోవైపు ఏపీఎండీసీకి గతంలో ఇసుక తవ్వకాలు, రవాణా చేసిన గుత్తేదారులు తమ బకాయిల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రూ.150 కోట్ల మేర జేపీ సంస్థ ఏపీఎండీసీకి చెల్లించాల్సి ఉంది.

sand
sand

రాష్ట్రంలో జేపీ పవర్‌ వెంచర్స్‌ ఇసుక బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు అవుతున్నప్పటికీ.. ఆ సంస్థ నుంచి బకాయిలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) రాబట్టుకోలేకపోతోంది. జేపీ సంస్థపై ఏపీఎండీసీ ఒత్తిడి తీసుకురాలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఏపీఎండీసీకి గతంలో ఇసుక తవ్వకాలు, రవాణా చేసిన గుత్తేదారులు తమ బకాయిల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్రంలో 2019 సెప్టెంబరు నుంచి ఏపీఎండీసీ ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టింది. ఈ ఏడాది మే 14 నుంచి అన్ని జిల్లాల్లో ఇసుక బాధ్యతలను జేపీ సంస్థకు టెండరు ద్వారా అప్పగించారు. ఆ సమయంలో ఏపీఎండీసీ 14 లక్షల టన్నుల ఇసుక అప్పగించింది. సీసీ కెమెరాలు, తూకపు యంత్రాలు తదితరాలన్నీ ఇచ్చింది. వీటన్నింటికీ కలిపి రూ.150 కోట్లు మేర జేపీ సంస్థ ఏపీఎండీసీకి చెల్లించాల్సి ఉంది.

ఆ ఇసుక విక్రయిస్తున్నా.. చెల్లింపులు లేవు
గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రీచ్‌ల వారీగా గుత్తేదారులు ఇసుక తవ్వకాలు, రవాణా చేశారు. వీరికి రూ.93 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అలాగే ష్యూరిటీ కింద డిపాజిట్లు చేసిన మొత్తం కూడా భారీగా ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు రూ.120 కోట్ల మేర గుత్తేదారులకు చెల్లించాలి. ఈ గుత్తేదారులు గతంలో తవ్వి.. డిపోలు, నిల్వ కేంద్రాలకు తరలించిన ఇసుకను ప్రస్తుతం జేపీ సంస్థ విక్రయిస్తోంది. అయినాసరే ఏపీఎండీసీకి బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు తమ బకాయిలు ఇవ్వాలంటూ గుత్తేదారులు పెద్ద సంఖ్యలో ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జేపీ సంస్థ ఇవ్వగానే చెల్లింపులు చేస్తామని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వృథా.. ఏడు లక్షల టన్నులు!
ఏపీఎండీసీ, జేపీ సంస్థకు అప్పగించిన ఇసుక రికార్డుల ప్రకారం 21 లక్షల టన్నులు ఉండగా, నిల్వకేంద్రాలు, డిపోల్లో వాస్తవంగా ఉన్నది 14 లక్షల టన్నులేనని తెలిసింది. రికార్డుల ప్రకారం జేపీ సంస్థ నుంచి 21 లక్షల టన్నులకు డబ్బులు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే 2019 సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మే 13 వరకు ఏపీఎండీసీ ఇసుక విక్రయాలు జరిపిన సమయంలో.. వృథా (గ్రౌండ్‌ లాస్‌) ఏడు లక్షల టన్నులు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి

Chandrababu Delhi tour: నేడు దిల్లీకి తెదేపా బృందం..మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ

Last Updated : Oct 25, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details