ఆంధ్రప్రదేశ్

andhra pradesh

pawan kalyan: రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలి: పవన్‌

By

Published : Oct 19, 2021, 8:56 PM IST

Updated : Oct 19, 2021, 10:07 PM IST

pawan kalyan

20:44 October 19

తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను ఖండించిన పవన్‌ కల్యాణ్‌

తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదన్నారు.  రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదన్న ఆయన.. ఈ పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. వ్యక్తులు, పార్టీ కార్యాలయాలపై దాడులు అరాచకానికి దారి తీస్తాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలన్న పవన్‌..నిందితులను శిక్షించకపోతే రాష్ట్రం అరాచకానికి చిరునామాగా మారుతుందన్నారు.  

కఠిన చర్యలు చేపట్టాలి: సోము వీర్రాజు

తెదేపా కార్యాలయాలపై దాడులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? శైలజానాథ్‌

'రాష్ట్రాన్ని వైకాపా ఎటు తీసుకెళ్తోంది.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా..? ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా..?  వైకాపా అధికారంలోకి వచ్చాక విధ్వంసాలు, కూల్చివేతలకు పాల్పడుతున్నారు. పార్టీలు అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ లేకపోవడం దారుణం. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలి. రాష్ట్రంలో ఇవాళ్టి దాడులపై కేంద్రం సమీక్షించాలి' - శైలజానాథ్‌, ఏపీసీసీ అధ్యక్షుడు 

ఇదొక దుష్ట సంప్రదాయం: రామకృష్ణ

తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీపై దాడులకు తెగబడటం దుష్ట సంప్రదాయమని అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated :Oct 19, 2021, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details