ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరంపై ఎంపీ గల్లా ప్రశ్న... కేంద్ర మంత్రి సమాధానం

By

Published : Feb 4, 2021, 11:44 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 2019లో 55వేల 548 కోట్లు కాగా.. 2020లో 47వేల 725 కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. భూమి తగ్గిపోవడం, బాధితుల పునరావాస ఖర్చులో మార్పులు రావడమే దీనికి ప్రధాన కారణమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 12వేల 311 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం 10,848 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించిందని పార్లమెంటుకు తెలియజేసింది. జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరిలో ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 548 కోట్లకు ఆమోదముద్ర వేయగా.. 2020 మార్చిలో ఏర్పాటైన రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ 47వేల 725 కోట్లకు తగ్గించిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. లోక్​సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Jal Shakthi Minister Answer on Polavaram In Parliament
Jal Shakthi Minister Answer on Polavaram In Parliament

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు, కేంద్రం తిరిగి చెల్లించిన మొత్తాలపై కేంద్ర జలశక్తి శాఖ స్పష్టత ఇచ్చింది. లోక్​సభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు వివరాలు వెల్లడించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరిలో జరిగిన 141వ సమావేశంలో పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని 2017-18నాటి ధరల ప్రకారం 55వేల 548.87 కోట్లకు ఆమోదముద్ర వేసిందని, ఇందులో తాగునీరు, సాగునీటి విభాగ వ్యయం 50వేల 987.96 కోట్ల రూపాయలు కాగా.. విద్యుత్‌ విభాగ వ్యయం 4వేల 560.91 కోట్లు ఉందని పేర్కొంది.

జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన మరో రివైజ్డ్ కాస్ట్‌ ఎస్టిమేట్‌ కమిటీ 2017-18 నాటి ధరల ప్రకారం... ప్రాజెక్టు సవరించిన అంచనాలను 47వేల 725.74 కోట్లుగా పేర్కొంటూ.. 2020 మార్చిలో సిఫారసు చేసినట్లు మంత్రి వివరించారు. దీనిలో తాగు, సాగునీటి విభాగ వ్యయం 43వేల 164.83 కోట్లు కాగా.. విద్యుత్‌ విభాగ వ్యయం 4వేల 560.91 కోట్లుగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ రెండు అంచనా మధ్య తేడాకు ప్రధాన కారణం ప్రభుత్వ, అటవీ భూమి తగ్గడంతోపాటు.. ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో వాడే మెటీరియల్ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకోవడమేనని సమాధానం ఇచ్చారు.

మరోవైపు ప్రాజెక్టు ముంపునకు గురయ్యే బాధితులకు కల్పించే మౌలిక వసతులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గించడం వల్ల ఒక్కొక్కరిపై వ్యయం 7 నుంచి 6.52 లక్షల రూపాయలకు తగ్గిపోయినట్లు అంచనా వేశారని మంత్రి పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 1 నాటికి మిగిలి ఉన్న ప్రాజెక్టు సాగునీటి విభాగంపై చేసే మిగిలిన ఖర్చులను నూరు శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని 2016 సెప్టెంబర్‌ 31న అప్పటి ఆర్థిక మంత్రి ప్రకటించారని, అందుకు అనుగుణంగా... ఆ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం పరిశీలించి సిఫారసు చేసిన మేరకు కేంద్రం చెల్లిస్తోందని కటారియా వివరించారు.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2020 డిసెంబర్‌ 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 12వేల 311.32 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 2014 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కేంద్ర సాయంగా 10వేల 848.36 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ చెల్లింపుల్లో 2020 డిసెంబర్‌లో విడుదల చేసిన 2వేల 234.20 కోట్లు కూడా కలిపి ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని మరో తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ పనులను పర్యవేక్షిస్తోందన్నారు. 2022 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ప్రాజెక్టు కోసం 1.67 లక్షల ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1.11 లక్షల ఎకరాల సేకరణ పూర్తైందన్నారు. భూసేకరణ, సహాయ, పునరావాసానికి 28వేల 172.21 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6వేల 583.11 కోట్లు ఖర్చు చేశారని, ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి పరిహారం నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు విధానాలను అనుసరిస్తోన్నట్లు మంత్రి కటారియా తెలిపారు. 2014 జనవరి 1కి ముందు సేకరించిన భూమికి 1894 భూసేకరణ చట్టం కింద... 2014 జనవరి 1 తర్వాత సేకరించిన భూమికి 2013 నాటి కొత్త చట్టం ప్రకారం పరిహారాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుపై చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లుల తిరిగి చెల్లింపు అన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం సిఫారసులు, వినియోగ ధ్రువపత్రాలు, ఆడిట్‌ సర్టిఫికెట్ల లాంటి అవసరమైన డాక్యుమెంట్ల సమర్పణపై ఆధారపడి ఉంటుందని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం...

2020 డిసెంబర్‌ నాటికి పోలవరం పనుల స్థితిగతుల వివరాలను మంత్రి సభకు అందించారు. దాని ప్రకారం... హెడ్‌వర్క్స్‌లో... ప్రధాన డ్యాం 69.68 శాతం, కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు 52.85 శాతం పూర్తి అయ్యింది. కుడి ప్రధాన కాలువ పనుల్లో.. భూమి పని 100 శాతం, లైనింగ్ 89 శాతం, నిర్మాణాలు 83.50 శాతం పూర్తయ్యాయి. ఎడమ ప్రధాన కాలువ పనుల్లో... భూమి పని 92 శాతం, లైనింగ్‌ 70 శాతం, నిర్మాణాలు 36.64 శాతం పూర్తయ్యాయి.

కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలు..

2014-15లో రూ.250 కోట్లు, 2015-16లో రూ.600 కోట్లు, 2016-17లో రూ.2,514.16 కోట్లు, 2017-18లో రూ.2000 కోట్లు, 2018-19లో రూ.1,400 కోట్లు, 2019-20లో రూ.1,850 కోట్లు, 2020-21లో ఇప్పటి వరకు రూ.2,234.20 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం రూ.10,848.36 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తిరిగి చెల్లించినట్లు కేంద్ర మంత్రి కటారియా లిఖిత పూర్వక సమాధానంలో వివరించారు.

ఇదీ చదవండీ... అత్యాచార బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details