ఆంధ్రప్రదేశ్

andhra pradesh

JAGAN LETTER: ‘దిశ’పై హోంశాఖకు అభిప్రాయాన్ని పంపించండి

By

Published : Jul 3, 2021, 9:02 AM IST

దిశ బిల్లులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సీఎం జగన్(cm jagan) లేఖ రాశారు. బిల్లుల్లోని అంశాలను వివరించేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామని తెలిపారు. దీనిని చట్టరూపంలోకి తెచ్చేందుకు దృష్టి సారించాలని కోరారు.

JAGAN LETTER TO SMRITI IRANI OVER DISHA BILL
‘దిశ’పై హోంశాఖకు అభిప్రాయాన్ని పంపించండి

దిశ బిల్లులపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు త్వరగా పంపించాలని ఆ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి(CM JAGAN) కోరారు. అవసరమైతే ఆ బిల్లుల్లోని అంశాలపై వివరించేందుకు ఏపీ తరఫున ఓ ప్రత్యేకాధికారిని నియమిస్తామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమెకు లేఖ రాశారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, చిన్నారులపై నేరాల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాలు) బిల్లు-2020, ఆంధ్రప్రదేశ్‌ దిశ- క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు-2019లను అసెంబ్లీలో ఆమోదించాం. మహిళలు, చిన్నారులపై క్రూరమైన లైంగిక నేరాలు జరిగినప్పుడు, వాటిల్లో స్పష్టమైన ఆధారాలుంటే వారం రోజుల్లోగా దర్యాప్తు, 14 రోజుల్లోగా న్యాయస్థానాల్లో విచారణ పూర్తి చేయించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఆయా కేసుల్లో సత్వర విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అంశమూ ఈ బిల్లుల్లో ఉంది. క్రిమినల్‌ లా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నందున.. మేము అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లుల్ని రాష్ట్రపతి సమ్మతి కోసం పంపించాం. వాటిపై అభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2021 జనవరి 11న, జూన్‌ 15న రెండుసార్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖలను పంపించింది. ఈ అంశంపై దృష్టిసారించి.. కేంద్ర హోంశాఖకు త్వరగా అభిప్రాయాన్ని పంపించేలా చర్యలు తీసుకోగలరు. ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు అవసరమైన మద్దతు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వగలరు. లింగ సమానత్వం, బాలల కేంద్రీకృత విధానాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయటంలో గత రెండేళ్లుగా మీరు చేస్తున్న కృషికి నా అభినందనలు.’’ అని ఆ లేఖలో వివరించారు. అందులోని ఇతర ప్రధానంశాలు ఇలా ఉన్నాయి..

143 కేసుల్లో శిక్షలు

* రాష్ట్రంలో 2019 డిసెంబరు నుంచి 162 అత్యాచార కేసులు, 1,353 లైంగిక వేధింపుల కేసుల్లో ఏడు రోజుల్లోగా అభియోగపత్రాలు దాఖలు చేశాం. వీటిలోని 143 కేసుల్లో శిక్షలు పడ్డాయి. వాటిల్లో మూడు కేసుల్లో చనిపోయేంత వరకూ జీవితఖైదు, 14 కేసుల్లో జీవితఖైదు శిక్ష పడింది. 498 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. మహిళలపై నేరాల దర్యాప్తునకు 2017లో సగటున 117 రోజులు పట్టేది. దాన్ని 41 రోజులకు తగ్గించగలిగాం. లైంగిక నేరాల దర్యాప్తు పూర్తి రేటు (ఇన్వెస్టిగేషన్‌ కంప్లైన్స్‌ రేటు) ఏపీలో ప్రస్తుతం 90.17 శాతంగా ఉంది. జాతీయస్థాయిలో ఇది 35 శాతమే.

* దిశ బిల్లుల్లోని అంశాల్ని అమలు చేసేందుకు ఒక ఐఏఎస్‌, ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించాం. 18 పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేశాం. వీటికి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. ఆపత్కాలంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు దిశ యాప్‌ తీసుకొచ్చాం. ఇప్పటివరకూ 19.83 లక్షల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గతేడాదిన్నరలో ఈ యాప్‌ ద్వారా 3,03,752 ఎస్‌వోఎస్‌ వినతులు వచ్చాయి. అందులో 1823 చర్యలు తీసుకోదగ్గ ఘటనలున్నాయి. వాటి ఆధారంగా 221 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. మంగళగిరి, తిరుపతి, విశాఖపట్నంలలో కొత్తగా దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 700 పోలీస్‌స్టేషన్లలో మహిళా సహాయ కేంద్రాలు నెలకొల్పాం. మహిళల భద్రత కోసం 900 ద్విచక్ర వాహనాలతో దిశ గస్తీ ప్రారంభించాం. కేసుల విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాల్ని ఖరారు చేశాం.

ఇదీ చదవండి:

KRISHNA BOARD: రంగంలోకి కృష్ణా బోర్డు

ABOUT THE AUTHOR

...view details