ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Investment proposals: పాత పెట్టుబడులకు కొత్త ప్రకటనలు..

By

Published : Sep 21, 2022, 7:42 AM IST

Investment proposals
పెట్టుబడిలో ఏపీ అగ్రగామి ()

Special story article on investment proposals: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకుల కృషితో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు అంతంతమాత్రమే. ఇందుకు అస్థిర విధానాలు, పెట్టుబడిదారులను తరిమికొట్టడం, పరిపాలన వికేంద్రీకరణ పేరిట రాజధాని అమరావతి విధ్వంసానికి పాల్పడటమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడో వచ్చిన పరిశ్రమల్ని ఇప్పుడు చూపిస్తూ.. పెట్టుబడుల్ని ఆకర్షించడంలో దేశంలోనే ఏపీ అగ్రగామి అని ప్రకటనలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Investment proposals in AP: కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం తాజాగా వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం 2022లో జులై వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ 6 వేల 173 కోట్లే. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏపీ తొమ్మిదో స్థానంలో ఉంది. గుజరాత్‌, ఒడిశా, కర్ణాటక తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌తో పోలిస్తే రాష్ట్రానికి పదమూడో వంతు పెట్టుబడులు రాలేదు. అయితే సమాచార, పౌర సంబంధాలశాఖ మాత్రం ఈ ఏడాది జులై వరకు రాష్ట్రానికి 40 వేల 361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా ఉందంటూ ప్రకటన విడుదల చేసింది. ఇక్కడే అసలు మతలబు ఉంది.

ఏపీ పెట్టుబడిలో

డీపీఐఐటీ గవర్నమెంట్‌ టు బిజినెస్‌ పోర్టల్‌:

సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, పారదర్శకతను నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా డీపీఐఐటీ కొన్నేళ్ల క్రితం గవర్నమెంట్‌ టు బిజినెస్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. ఉత్పాదక రంగంలో 10 కోట్లకు పైగా, సేవారంగంలో 5 కోట్లకుపైగా పెట్టుబడులతో ఏర్పాటైన పరిశ్రమలు.. ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మెమొరాండం పేరుతో రెండు దశల్లో దరఖాస్తులు సమర్పించాలని నిర్దేశించింది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు, విస్తరణకు వెళ్లే పరిశ్రమలు ఐఈఎం పార్ట్‌-ఎ సమర్పించాలి. పరిశ్రమ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభమయ్యాక పార్ట్‌-బి సమర్పించాల్సి ఉంటుంది.

నెలవారీగా పార్ట్‌-ఎ, పార్ట్‌-బి సమర్పించిన పరిశ్రమల వివరాలు:

అలా నెలవారీగా పార్ట్‌-ఎ, పార్ట్‌-బి సమర్పించిన పరిశ్రమలు, రాష్ట్రాలవారీగా పెట్టుబడుల వివరాల్ని డీపీఐఐటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. గతంలో ఒప్పందాలు జరిగి, ఉత్పత్తి ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత పార్ట్‌-బిని సమర్పించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి డీపీఐఐటీ పార్ట్‌-బిలో వెల్లడించిన వివరాల్లోనూ గత ప్రభుత్వాల హయాంలో ఒప్పందాలు చేసుకున్న వాటిని పేర్కొనడం జరిగింది. కొన్నేళ్ల క్రితమే ఉత్పత్తి ప్రారంభించినవే. ఇప్పుడు పార్ట్‌-బి సమర్పించిన కంపెనీల వివరాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే పార్ట్‌-బిలో పేర్కొన్న పెట్టుబడులన్నీ ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో వచ్చినట్లు కాదని అర్థమవుతోంది. గతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తున్నవన్నమాట.

29 పరిశ్రమల్లో 20కిపైగా గత ప్రభుత్వాల హయాంలోనే ఒప్పందాలు:

రాష్ట్రంలో 2022లో జనవరి నుంచి జులై నెలాఖరు వరకు మొత్తం 6,173 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని డీపీఐఐటీ పేర్కొంది. వాటిలోనూ కొన్ని గత ప్రభుత్వ హయాంలోనే చర్చలు, ఒప్పందాలు జరిగినవి ఉన్నాయి. ఆయా సంస్థలు ఇప్పుడు పార్ట్‌-ఎ సమర్పించినవి, పరిశ్రమల్లో విస్తరణకు వెళుతున్నవి ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని కాప్రికార్న్‌ డిస్టిలరీ 2015 మే 27నే ఉత్పత్తి ప్రారంభించింది. సెంబ్‌కార్ప్‌ ఇండస్ట్రీస్‌ నెల్లూరులో 2,640 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాల్ని20వేల కోట్లతో ఏర్పాటు చేసింది. 2009, 2011 సంవత్సరాల్లోనే పార్ట్‌-ఎ సమర్పించాయి. 2015, 2017 సంవత్సరాల్లో ప్లాంట్లు ఉత్పత్తిలోకి వచ్చాయి. ఈ ఏడాది జులై 7న డీపీఐఐటీకి పార్ట్‌-బి సమర్పించాయి.

2022 జనవరి నుంచి జులై వరకు డీపీఐఐటీకి ఏపీ నుంచి ఐఈఎం పార్ట్‌-బి దరఖాస్తులు సమర్పించిన సంస్థలు 29 ఉన్నాయి. వాటి మొత్తం పెట్టుబడుల విలువ 40 వేల361 కోట్లు. పార్ట్‌-బి దరఖాస్తుల ఆధారంగా.. పెట్టుబడుల్ని లెక్కిస్తే దేశంలోని 28రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ 29 పరిశ్రమల్లో 20కిపైగా గత ప్రభుత్వాల హయాంలోనే ఒప్పందాలు చేసుకుని, ఉత్పత్తి ప్రారంభించినవే.

తమ హయాంలో సంస్థలు వచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్న ప్రభుత్వ ం:
కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో 75 ఎకరాల్లో అశోక్‌ లేలాండ్‌ బస్సుల తయారీ యూనిట్‌కు 2018 మార్చిలోనే శంకుస్థాపన జరిగింది. ఈ సంస్థ 2018 జులై 4న ఐఈఎం పార్ట్‌-ఎ దరఖాస్తు చేసినట్లు, 2021 ఫిబ్రవరి 19న ఉత్పత్తి ప్రారంభించినట్టు, 2022 మార్చి 10 పార్ట్‌-బి దరఖాస్తు సమర్పించినట్టు ఉంది. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ కాకినాడ జిల్లాలో 861 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు.. 2018 ఫిబ్రవరి 24న ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. డీపీఐఐటీ వివరాల ప్రకారం ఆ సంస్థ 2019 డిసెంబరు 2నే పార్ట్‌-ఎ సమర్పించింది. 2021 డిసెంబరు 27న ఉత్పత్తి ప్రారంభించింది. 2022 జూన్‌ 15న పార్ట్‌-బి సమర్పించింది. అంటే ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటున్నట్లు ఈ పరిశ్రమలన్నీ ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి కాదన్నమాట.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details