Drones carrying humans : కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలకు కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి పరిశోధనలు చేయిస్తోంది. అందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌కు రూ.135 కోట్లు అందించింది. చోదకులు లేకుండా నేలపై, నీటిలో, ఆకాశంలో నడిచే వాహనాలను రూపొందించేలా ఇక్కడ కృషి కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లగలిగే డ్రోన్‌ను వారం రోజుల్లో పరీక్షించేందుకు రంగం సిద్ధమైంది. కొన్నేళ్లుగా ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఐఐటీ ప్రాంగణంలో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించనున్నారు. డ్రైవర్ అవసరం లేకుండానే జీపీఎస్ ఆధారంగా నిర్దేశించిన గమ్యానికి ఈ డ్రోన్ మనుషులను తీసుకెళుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఎంపిక చేసిన కొన్ని చోట్ల వీటిని వినియోగించడంపై దృష్టి సారించనున్నారు.
ఆగిన చోటుకు వచ్చే సైకిల్:అటానమస్ నావిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ పరిశోధకులు చోదకరహిత సైకిల్‌నూ అందుబాటులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. మనం బస్సు లేదా రైల్వేస్టేషన్‌లో దిగిన తర్వాత సైకిల్‌పై వెళ్లాలనుకుంటే... పార్కింగ్ ప్రదేశాల్లో ఉండే సైకిల్ మీ వద్దకు తనంతట తానే వచ్చేస్తుంది. ఎక్కి కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెబితే చాలు తొక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది. బ్యాటరీతో నడిచే దీన్ని పరీక్షించేందుకు మరికొంత సమయం పట్టనుంది.