ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Medaram Jatara 2022: జనసంద్రంగా మేడారం.. దర్శనానికి రెండు గంటల సమయం

By

Published : Feb 16, 2022, 4:00 PM IST

Medaram Jatara 2022: మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు.. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకుంటున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జాతరలో కొబ్బరికాయలు, బంగారు(బెల్లం) ధరలు కొండెక్కాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మేడారం
మేడారం

Medaram Jatara 2022:ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతర వైభవంగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి చేరిన భక్తులతో.. వనమంతా జనమయంగా మారింది. నేటి నుంచి 19 వరకు జాతర ఘనంగా జరగనుంది. ఇవాళ సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య... కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుంది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు.

ముంగిళ్ల వద్ద రంగవల్లులతో..

సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని(బంగారం) కానుకగా సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే గుడిసెలు ఏర్పాటు చేసి ముంగిళ్ల వద్ద రంగవల్లులతో అందంగా అలంకరించారు. అమ్మవార్లకు బెల్లం చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకొని తన్మయత్వానికి లోనవుతున్నారు.

కొండెక్కిన ధరలు..

మంగళవారం రాత్రి వరకు మోస్తరుగా ఉన్న రద్దీ.. ఇవాళ ఉదయం నుంచి పెద్దఎత్తున పెరిగింది. దీంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు జాతరలో కొబ్బరికాయలు, బంగారు(బెల్లం) ధరలు కొండెక్కాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.50, బెల్లం కేజీ రూ.80 నుంచి 120 వరకు అమ్ముతున్నారని భక్తులు మండిపడుతున్నారు.

18న సీఎం.. 19న రేవంత్​..

వనదేవతల దర్శనానికి భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వన దేవతలను దర్శిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి దేవతల్ని దర్శించుకున్నారు. దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన శ్రీధర్‌బాబు... మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 19న మహాజాతరకు వస్తారని సీతక్క తెలిపారు.

జాతర ప్రాంగణంలో రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వరంగల్‌ నుంచి వచ్చే ప్రధాన రహదారిని విస్తరించారు. నాలుగు వేల ఆర్టీసీ బస్సులు సహా దాదాపు 50 లక్షల వాహనాలు జాతరకు వచ్చే వీలుంది. ఎప్పటి చెత్త అప్పుడే తొలగించడం, దుమ్ము రేగకుండా నీళ్లను చల్లడం వంటి చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్‌ను నిషేధించారు. భక్తుల కోసం 327 ప్రాంతాల్లో 20వేలకు పైగా శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించారు.

పార్కింగు కోసం 1,100 ఎకరాలు..

ప్రైవేట్‌ వాహనాలకు పార్కింగు దూరంగా ఉంది. పార్కింగు కోసం 1,100 ఎకరాలు కేటాయించారు. 32 ఎకరాల్లో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. జంపన్నవాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించారు. జాతరకు ట్రాఫిక్‌ రద్దీ ప్రధాన సమస్య కాగా.. దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర ప్రాంగణంలో హరిత హోటల్‌ ఉండగా.. తాడ్వాయిలో మరో హోటల్‌ను పర్యాటక శాఖ నిర్మించింది.

ABOUT THE AUTHOR

...view details