ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మరోమారు హైదరాబాద్​ను కుదిపేసిన వర్షాలు

By

Published : Oct 18, 2020, 7:45 AM IST

శనివారం సాయంత్రం.. అప్పటివరకు కాస్తున్న ఎండ మబ్బుల చాటుకు వెళ్లింది. సమయం తీసుకుని.. అప్పుడొకటి అప్పుడొకటి చినుకులు పడటం మొదలైంది. నగరవాసులు ఈ పరిణామాలను గమనిస్తూ భయం భయంగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కాసేపటికే వర్షం నగరమంతా విస్తరించింది. సుమారు గంటన్నర వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదైంది. నాలుగు రోజుల కిందట జరిగిన పరిణామాలు గుర్తొచ్చి ప్రజల్లో వణుకు మొదలైంది.

flood water
జలమయమయిన రోడ్లు

హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌ పరిధిలోని 17 భవనాలకు, సౌత్‌ సర్కిల్‌లో బార్కాస్‌, చార్మినార్‌ పరిధిలోని కొన్ని కాలనీలకు, సికింద్రాబాద్‌ సర్కిల్‌లోని 8 అపార్ట్‌మెంట్లకు, మరో రెండు కాలనీలకు నాలుగు రోజులుగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. సరూర్‌నగర్‌, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోని కరెంట్‌ సమస్యలు కొనసాగుతున్నాయి. శనివారం మలక్‌పేటలో విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మరణించారు.

శివారుల్లో వర్షం శివాలు

నగరంతోపాటు శివార్లలో శనివారం రాత్రి మరోమారు భారీ వర్షం కురిసింది. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్‌, వెంకటేశ్వరకాలనీలను వరద ముంచెత్తింది. బీఎన్‌రెడ్డి నగర్‌ డివిజన్‌ హరిహరపురం కాలనీలో మళ్లీ వరద ఉద్ధృతి పెరిగింది. 14 కాలనీలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. మల్లాపూర్‌ డివిజన్‌ బ్రహ్మపురి కాలనీ, గ్రీన్‌హిల్స్‌ కాలనీ, భవానీనగర్‌, మర్రిగూడ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. కంచన్‌బాగ్‌ పరిధిలో డీఆర్‌డీఓ సీ బ్లాక్‌ గోడ కూలింది. హఫీజ్‌బాబా నగర్‌లో 40 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మరోసారి రెండు గేట్లు ఎత్తివేత

హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో శనివారం రాత్రి రెండు క్రస్టుగేట్లు అడుగు మేర ఎత్తి ప్రవాహాన్ని మూసీ నదిలోకి వదిలేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా జోరువాన మొదలవడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయంలో నీటిమట్టం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతోంది. అర్ధరాత్రికి వరద పెరిగితే మరిన్ని గేట్లు తెరవనున్నారు.

నడిరోడ్లపై నరకయాతన

టోలిచౌకి-బృందావన్‌కాలనీ మధ్య వరద నీరు నిలిచి భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మెహిదీపట్నం, బయోడైవర్సిటీ కూడలి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. చాంద్రాయణగుట్ట ఫలక్‌నుమా మధ్య ఆర్‌ఓబీ రోడ్డు కుంగిన ఘటనలో ప్రమాదం తప్పింది. శంషాబాద్‌, ఆరాంఘర్‌ దారుల్లో వాహనాలు కదల్లేదు. పాత కర్నూలు మార్గంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపైనా ఇదే పరిస్థితి. పంజాగుట్ట- ఖైరతాబాద్‌ మధ్య గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.

వర్షపాతం (సెం.మీ.లలో)

ఘట్‌కేసర్‌ 18.10

నాగోల్‌ 16.95

పీర్జాదిగూడ 16.93

ఎల్బీనగర్‌ 16.43

బండ్లగూడ 15.3

సైదాబాద్‌ 14.6

చార్మినార్‌ 13.50

ముషీరాబాద్‌ 12.60

షేక్‌పేట 11.70

ABOUT THE AUTHOR

...view details